జగన్ సర్కార్ చేపడుతోన్న సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ, జనసేన, భాజాపా సహా అన్ని పార్టీలు విమర్శ అనే ఒకే ఎజెండాతో ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇసుక విధానం, ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదాన, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇలా జగన్ ఏడాది పాలనపై ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే అధికారంగా కలిసి పనిచేస్తుంది మాత్రం బీజేపీ-జనసేన పార్టీలే. టీడీపీలా రాజకీయంగా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నది ఈ రెండు పార్టీలే. ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారు. జగన్ సీఎం పదవికి అర్హుడు కాదంటూ.. ముఖ్యమంత్రి లక్షణాలేవి కూడా జగన్ లో లేవంటూ విమర్శించడం కాస్త జగన్ ని వ్యక్తిగతంగాను దూషించినట్లు అయింది.
ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీల మైత్రీని బ్రేక్ చేయడానికి జగన్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయిన సందర్భంగా ఎన్నడు లేని విధంగా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల పరిణామాలు మారినట్లు కనిపిస్తోంది. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదానే ఆయుధంగా రాజకీయాలు చేసారు. అధికారం వస్తే హోదా తెస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి మరో రకమైన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ఉన్న పార్టీకీ మెజార్టీ ఎక్కువ రావడంతో సీన్ మారింది. దీంతో జగన్ కూడా హోదా విషయంపై నీరు గారారు.
భాజాపాకు అంత మెజార్టీ వస్తే మనం ఏంచేయగలమని సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవలే మళ్లీ ప్రత్యేక హోదా విషయాన్ని జగన్ తెరపైకి తెచ్చారు. దీంతో జగన్ ఆ మాట అనడానికి కారణంగా ఏంటి? అంటే ఏపీలో జనసేన-బీజేపీ బంధాన్ని బ్రేక్ చేయడానికే ఆ మాట అన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా లాంటి కష్టకాలాన్ని ఎదుర్కుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ జగన్ సర్కార్ చిత్తశుద్ది గా పనిచేసింది. అయినా ఏపీ బీజేపీ నాయకులు అవేం పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ నాయకులుకు చిత్త శుద్ది ఉంటే ఏపీకి నిధులు తీసుకురావాలని, అలా కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఏం వస్తుందని వైకాపా నాయకులతో జగన్ అన్నారుట.
ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తితే ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ అవ్వడం సహా జనసేనని ఆలోచనలో పడేసినట్లు అవుతుందని జగన్ భావించే హోదా అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక హోదాపై మోదీ పాచిపోయిన లడ్డూలు తెచ్చారంటూ రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారనే జగన్ హోదా మాటెత్తిన్నట్లు పొలిటికల్ కారిడర్ లో చర్చకొచ్చింది. అలాగే జనసేనాని ఓసారి ఏపీ బీజేపీ తీరుపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు.
