Bhartha Mahasayulaku Wignyapthi Movie Review: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ!

రచన- దర్శకత్వం : కిషోర్ తిరుమల
తారాగణం : రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతీ, సునీల్, సత్య, సోనియా సింగ్ తారక్ పొన్నప్ప తదితరులు
సంగీతం : భీమ్స్ సిసిరోలియో, చాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ, కూర్పు : శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల : జనవరి 13, 2026

Bhartha Mahasayulaku Wignyapthi Movie Review: యాక్షన్ సినిమాలతో పరాజయాల పరంపర కొనసాగించైనా మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ సినిమా కొచ్చేశాడు. ఇద్దరు హీరోయిన్లతో ఎంటర్ టైన్మెంట్ వుండే మూవీతో సంక్రాంతి పండుగ ప్రేక్షకులకి వినోదాల విందు పంచి పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఫ్యామిలీ సినిమాలు తీసే కిషోర్ తిరుమల దీనికి దర్శకుడు. నేనూ శైలజ, ఉన్నది ఒక్కటే జీవితం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు వంటి హిట్స్ తో నిరూపించుకున్న కిషోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ చేసిన హితబోధ ఏమిటి? ఇది ఏ మేరకు పండగ మూడ్ నే కాపాడింది? రవితేజకి ఇప్పుడైనా హిట్ పడిందా? ఈ సందేహాలు రివ్యూలో తీర్చుకుందాం.

కథేమిటి?
రామ్ సత్యనారాయణ (రవితేజ) వైన్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. స్పెయిన్ లో వుండే మానస (ఆషికా రంగనాథ్‌) కంపెనీతో పార్ట్ నర షిప్ కోరుకుని ఆమెని కలుసుకుంటాడు. తన బ్రాండ్ వైన్ తనదే అని చెప్పకుండా ఆమె కంపెనీ ద్వారా ప్రమోట్ చేయాలనీ కోరతాడు. మానస కనెక్ట్ అవుతుంది. దాంతో రాం తనకి పెళ్ళయిన విషయం దచిఎత్తి ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడ భార్య బాలామణి (డింపుల్ హయతీ) భర్త మీద పూర్తి నమ్మకంతో వుంటుంది. ఇంతలోసదేన్ గా స్పెయిన్ నుంచి మానస వచ్చేస్తుంది. ఆమె గురించి భార్యకి తెలియకుండా మేనేజ్ చేయడం మొదలెడతాడు రాం. మానస తన బ్రాండ్ వైన్ కి ఓనర్ ఎవరో కలవాలని అనేసరికి ఇరుకున పడతాడు. ఇక నిజం చెప్పేస్తాడు. దీంతో మానస ఏం చేసింది? ఆమె బాలామణిని కలిసి ఏం చేసింది? ఇద్దరి మధ్య ఇరుక్కున్న రాం ఇందులోంచి ఎలా బయటపడ్డాడు? బాలామణి, మానస లేమయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ?
పండుగ సినిమా అంటే కథ ఉండ కూడదని నిర్ణయించుకున్నారేమో. పండక్కి విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భార్యాభర్తల కథలాగే ఇందులోనూ కథలేదు, కామెడీ మాత్రమే వుంది. కకథ లేకుండా కేవలం కామెడీతో కూర్చోబెట్ట గలనని కిషోర్ తిరుమల కూడా ప్రేక్షకుల్ని ఈజీగా తీ సుకున్నాడు. ప్రియురాలు- భార్య- మధ్యలో హీరో కథలు ఎన్ని రాలేదు? మళ్ళీ ఇంకొకటి తీయాల్సిన అవసరముందా? తీస్తే కథ లేకుండా తీయాలా? అని దర్శకుడి మైండ్ సెట్ ని ప్రశ్నించే పరిస్థితి.

ఈ కామెడీతో ఫస్టాఫ్ వరకూ ఎలాగో ఎంటర్ టైన్ చేస్తూ ఇంటర్వెల్ వరకూ లాక్కొచ్చాడు. స్పెయిన్ లో హీరోయిన్ ఆషికా రంగనాథ్ తో సిట్యుయేశనల్ కామెడీ బాగానే వినోదాన్ని పంచింది. వెంట సునీల్, సత్యలు రవితేజ కామెడీకి సపోర్టుగా బాగానే నవ్వించారు. రవితేజ స్పెయిన్ లో ఆషికాతొ ఎఫైర్ పెట్టుకుని హైదరాబాద్‌కి వచ్చాక భార్య డింపుల్‌ కి తన ఎఫైర్ బయటపడకుండా పాట్లు పడడం కామెడీ గానే సాగుతుంది. అయితే ఆషికా హైదరాబాద్ వచ్చేశాక నడిచే ఎపిసోడ్ తర్వాత ఇంటర్వెల్లో డింపుల్ తో రవితేజ కేర్పడే కాన్ఫ్లిక్ట్ బలహీనంగా ఉంటంది. చిరంజీవి సినిమాలోలాగే.

దీని తర్వాత సెకండాఫ్ షరా మామూలే. లేని కథతో సెకండాఫ్ ని నిలబెట్టే ప్రయత్నమంతా దర్శకుడికే భారంగా మారింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎలా సాగుతాయో తెలిసి తెలిసి వున్న విషయమే. మూడు ప్రధాన పాత్రల మధ్య కథ వున్నా, దాన్ని పరిష్కరించే అవసరమున్నా అంత శ్రమ తీసుకోదల్చుకోలేదు దర్శకుడు. దీంతో కామెడీకి ఇంకో కమెడియన్ వెన్నెల కిషోర్ ని దింపి రవితేజకి కనెక్ట్ చేశాడు. ఎలాగో ముగింపుకి తెచ్చి చిన్న మాటతో సమస్యని పరిష్కరించేసి- మగవాళ్ళ మనస్తత్వాల గురించి ఒక మెసేజ్ తో ముగించేశాడు.

ఎవరెలా చేశారు?
మళ్ళీ పాత రవితేజ తెరమీద ప్రత్యక్షమయ్యాడు ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేస్తూ. రెగ్యులర్ మాస్ మహారాజాలా కాక, క్లాస్ యువరాజాలా మార్పు చూపిస్తూ. కామెడీయే తప్ప ఎమోషన్లు లేకపోవడంతో పాత్రకి మాత్రం బలం లేకపోవడం ప్రధాన లోపం. పాతాల్లో డాన్సులు బాగా చేశాడు. భార్య పాత్రలో డింపుల్‌ ఫర్వాలేదు. రవితేజని డామినేట్ చేసే పాత్రగా మాత్రం ఆమె సరిపోలేదు. ప్రేయసి పాత్రలో ఆషికా రంగనాథ్‌ తన గ్లామర్ ని ఆరబోసింది. పాత్ర మేరకు నటన కూడా బావుంది. ఆమె అసిస్టెంట్‌గా సత్య బాగానే నవ్విస్తాడు. రవితేజ అసిస్టెంట్‌గా వెన్నెల కిశోర్‌ ది తన బ్రాండ్ కామెడీ. ఇక సునీల్ ఈసారి కామెడీ రోల్ లోకన్పించడం విశేషం.

సాంకేతికాల సంగతి?
భీమ్స్ సిసిరోలియో సంగీతంలో సినిమాకి పాటలు ప్లస్‌ అయ్యాయి. బీజీఎం కూడా బావుంది. ప్రసాద్‌ మూరెళ్ల కెమెరా వర్క్ స్పెయిన్ దృశ్యాల చిత్రీకరణతో కళ్ళు చేదిరెట్టు వుంది. మంచి లోకేషన్స్ కి మంచి విజువల్స్ తోడయ్యాయి. ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్ ఏఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్ కూడా బావున్నాయి. నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

దర్శకుడు కిశోర్‌ తిరుమల కథని పట్టించుకోక పోవడంతో ఎలాటి ఎమోషన్లు, ఫ్యామిలీ సెంటిమెంట్లూ లేకుండా పోయాయి. కథ లేకుండా రవితేజ మీద భారం వేసి ఉత్త కామెడీని నమ్ముకుంటే అది ఆశించిన ఫలితాలకి దూరంగా ఉండిపోయింది. అయితే రవితేజకి రెగ్యులర్ రక్తపాతాల్లేని ఈ మాత్రం క్లీన్ ఎంటర్ టైనర్ దక్కినందుకు సంతోషించాలి!

రేటింగ్ : 2.25 / 5

Bhartha Mahasayulaku Wignyapthi Review By Journalist Bharadwaj || Ravi Teja || Telugu Rajyam