Janasena Graph: 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడే పోటీ చేసిన రెండు చోట్లా ఘోర ఓటమి చవి చూసిన స్థితి. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచిన పరిస్థితి. ఐదేళ్ల కాలంలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది ఆ పార్టీ. రాజకీయాల్లో ఓడలు బళ్ళు, బళ్లు ఓడలు అవుతుంటాయి అనేది నిజమే కానీ.. జనసేన విషయంలో 100% స్ట్రైక్ రేట్ చిన్న విషయం కాదు. మరి ప్రజలు ఇంతగా నమ్మిన పవన్ కల్యాణ్.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తనను నమ్మిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా..?
తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడు అని నమ్మి, తమను ఉద్దరిస్తాడు అని విశ్వసించి ఓటు వేసిన వారికి పవన్ కల్యాణ్ 2025లో ఏమి చేశారు..?
అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీలు, చెప్పిన స్టేట్ మెంట్లు.. అధికారం వచ్చిన తర్వాత చేతల్లో చూపించగలిగారా..?
జగన్ ని పరదాల సీఎం అని పిలిచిన పవన్ సైతం పరదాల డిప్యుటీ సీఎం అయిపోయారనే కామెంట్లకు ఆయన సమాధానం ఏమిటి..?
జవాబుధారీతనం లేని పాలన కూటమి ప్రభుత్వంలో ఉందని అంటున్న వేళ.. అందులో పవన్ పాత్ర ఎంత..?
బహిరంగ సభల్లో మైకుల ముందు పవన్ చేస్తున్న ప్రసంగాలు.. ఆయనలోని ధైర్యాన్ని సూచిస్తున్నాయా.. లేక, అంతర్లీనంగా ఉన్న భయాన్ని ప్రతిబింభిస్తున్నాయా..?

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జత కట్టిన పవన్ కల్యాణ్ జనసేన.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది. వాస్తవానికి 21 స్థానాలు మాత్రమే తీసుకోవడంపై జనసేన అధినేతను తీవ్రంగా విమర్శించించినవారు ఉన్నారు.. ఇది ప్రస్తుతానికి అప్రస్తుతం! మరోవైపు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్లూ ఉన్నారు.. కానీ, ఆ కోరిక పవన్ కు లేదు.. ఆయన చంద్రబాబు & కో సీఎంగా ఉంటే, తాను ఆ పక్కన బండి లాగించేద్దామని అనుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఆ సంగతి అలా ఉంటే… 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇందులో రెవిన్యూ, హోం, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, మెడికల్, ఎక్సైజ్… ఇలా దాదాపు అన్ని కీలక శాఖలూ ఉన్నాయి. దీంతో… కూటమి ప్రభుత్వంలో పవన్ కీ-రోల్ పోషిస్తారని చాలా మంది భావించి ఓటు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాను సీఎం కాదని, తాను హోంమంత్రిని కాదంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు ప్రవరిస్తున్నారని అంటున్నారు!
ఇక బహిరంగ సభల్లో పవన్ చేసే వ్యాఖ్యలు… ఆయన అధికారంలో ఉన్నా రా.. ప్రతిపక్షంలో ఉన్నారా.. లేక.. స్వపక్షంలో విపక్షం పాత్రను పోషిస్తున్నారా అనే సందేహాలకు తావిస్తోందని చెప్పేవారూ లేకపోలేదు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. తాను ప్రశ్నించడం లేదు.. తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వడం లేదు.. ఆన్ లైన్ వేదికగా ఆ ప్రశ్నలు తన దృష్టికి వచ్చినా.. “ఏమో సార్ నాకు కనబడదు.. నాకు వినబడదు!” అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారని అంటున్నారు.

ఇదే క్రమంలో… వైసీపీ, టీడీపీ, బీజేపీలకు దూరంగా ఉండే చాలామందికి జనసేన సరికొత్త ఆప్షన్ గా కనిపించిందనే కామెంట్లూ తొలుత వినిపించాయి. యువత ఎక్కువగా ఆకర్షితులవ్వడానికి ఇది కూడా ఒక కారణం అని నమ్మినవారూ లేకపోలేదు. కానీ… ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తన ప్రజల మనిషిని, తాను ప్రజల కోసం పోరాడతాను అని చెప్పుకున్న పవన్.. అధికారంలోకి వచ్చి, ఆరు నెలల హనీమూన్ పిరియడ్ అయిన తర్వాత 2025 ఏడాది మొత్తం తన గ్రాఫ్ ను పూర్తిగా దిగజార్చేసుకున్నారని అంటున్నారు.
పైగా కాపు సామాజికవర్గాన్ని పవన్ దూరం చేసుకుంటున్నారనే చర్చా బలంగా జరుగుతోంది. ఇటీవల రంగా వర్ధంతి నాడు ఆయన వ్యవహరించిన తీరు చూసినవారు.. ఆ సామాజికవర్గానికి రియల్ హీరో అని చెప్పుకునే వంగాను మరిచిన రీల్ హీరోగానే పవన్ ని చూస్తున్నారనే చర్చా జరుగుతుందని చెబుతున్నారు. దీంతో.. తాను మొదటి నుంచీ చెబుతున్నది అదే కదా అనే ముద్రగడ పద్మనాభం మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు!
ఏది ఏమైనా… తాను పసుపు తానులో ముక్కను అన్నట్లుగా ఉన్న పవన్ తీరుపై 2025లో తీవ్ర విమర్శలు వచ్చాయనే చెబుతున్నారు పరిశీలకులు. ఈ విషయంలో పవన్ తీరు మారకపోతే.. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో అటకెక్కించిన వాటి గురించి పట్టించుకోకపోతే.. ఇక తాను ఇచ్చిన హామీల ఊసు ఎత్తకపోతే… ముందు ముందు మళ్లీ 2019 పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు!

