సంక్రాంతి రోజున ఈ 5 వస్తువులు కొంటే.. లక్ష్మీ కటాక్షం పక్కా..!

ఇంట్లో అన్నీ బాగానే ఉన్నా, ఎందుకో తెలియని అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం ఎదురవుతున్నాయా? చాలాసార్లు సమస్య మన చుట్టూ ఉన్న శక్తి ప్రవాహంలోనే ఉంటుంది అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో కొన్ని వస్తువులను సరైన దిశలో ఉంచడం ద్వారా ప్రతికూల శక్తిని దూరం చేసి, సిరిసంపదలను ఆకర్షించవచ్చని వారు సూచిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మార్పులు చేయడం మరింత శుభఫలితాలను ఇస్తుందని విశ్వాసం.

శ్రావ్యమైన శబ్దాలతో ఇంట్లో ప్రశాంతతను నింపే విండ్ చైమ్స్ వాస్తులో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. గాలి వీచే ప్రదేశంలో వీటిని ఉంచితే, అక్కడ నిలిచిపోయిన ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెబుతారు. ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తర దిశలో విండ్ చైమ్స్ ఉంచితే ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.
ఇత్తడి లేదా బంగారు రంగులో ఉండే లోహపు తాబేలు సంపదకు, స్థిరత్వానికి చిహ్నంగా భావిస్తారు. విష్ణుమూర్తి అవతారానికి ప్రతీకగా పూజించే తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇటీవల చాలా ఇళ్లలో కనిపిస్తున్న క్రిస్టల్ బాల్స్ కూడా అదృష్టాన్ని ఆకర్షించే వస్తువులుగా గుర్తింపు పొందాయి. ఇవి ఇంట్లోని శక్తిని సమతుల్యం చేస్తాయని, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచుతాయని చెబుతారు. ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ లేదా పూజా స్థలంలో క్రిస్టల్ వస్తువులు ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నవారికి లక్కీ నాణేలు మంచి పరిష్కారమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రిబ్బన్‌తో కట్టిన మూడు రాగి నాణేలను ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపున ఉంచితే, డబ్బు అడ్డంకులు తొలగిపోయి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని నమ్మకం.

దాంపత్య జీవితంలో అనురాగం, ప్రేమ బలపడాలనుకునేవారికి మాండరిన్ బాతుల జంటను సూచిస్తారు. ఒక జత బాతుల విగ్రహాన్ని పడకగదిలోని నైరుతి దిశలో ఉంచడం వల్ల సంబంధాల్లో మధురత పెరుగుతుందని చెబుతారు. ఒంటరిగా కాకుండా జంటగా ఉండటం ఈ వస్తువు ప్రత్యేకత. ఈ శుభ వస్తువులను తెచ్చినప్పుడు దిశల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో కీలకం. తూర్పు, ఉత్తర దిశలను ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చిన్న మార్పులు చేస్తేనే ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, అదృష్టం సహజంగానే మీ వెంట నడుస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.