Pawan Kondagattu Visit: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్‌కు వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ కల్యాణ్ భూమి పూజ నిర్వహించారు. ఈ నిర్మాణ పనులకు మొత్తం రూ. 35.19 కోట్ల వ్యయం కానుంది. విశేషమేమిటంటే, ఈ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భరిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఆలయ అధికారులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

భూమి పూజ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “గతంలో ఒక రాజకీయ పర్యటనలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుండి నేను ప్రాణాలతో బయటపడటం వెనుక కొండగట్టు అంజన్న కృప ఉంది. ఆ ప్రమాదాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్వామివారే నన్ను కాపాడారు” అని ఆయన గుర్తుచేసుకున్నారు.
కొండగట్టు అభివృద్ధిపై స్పందిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దైవ కార్యాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని, ఆయన సహకారంతోనే ఈ నిధుల మంజూరు సులభమైందని పవన్ తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బి.ఆర్. నాయుడు మరియు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల సమష్టి కృషి వల్లనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నేతల సహకారంతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ బృందావనం రిసార్ట్‌లో స్థానిక సర్పంచ్‌లు, జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమై స్థానిక పరిస్థితులపై చర్చించారు.

