తిరుపతి బై పోల్: జనసేన ఓటు బీజేపీకి పడుతుందా.? లేదా.?

BJP Worrying About Janasena
BJP Worrying About Janasena
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ముగిసింది.. రేపే పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వం షురూ అయ్యింది. నిన్న రాత్రి నుంచే గ్రామాల్లో పెద్దయెత్తున డబ్బుల పంపిణీ మొదలైపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను కొనేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ, తన ఓటు బ్యాంకు విషయమై పూర్తి ధీమాతో వుంది. టీడీపీ కూడా తిరుపతిపై ధీమాగానే కనిపిస్తోంది. ఎటొచ్చీ అసలు సమస్య భారతీయ జనతా పార్టీకే. మిత్రపక్షం జనసేన నుంచి ఓటు బ్యాంకు తమవైపుకు వస్తుందా.? లేదా.? అన్నదే బీజేపీ టెన్షన్. ‘తిరుపతితోపాటు ఆంధ్రపదేశ్ అభివృద్ధి కోసం జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ఓటెయ్యండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం విదితమే. అయినాగానీ, జనసైనికులు బీజేపీ పట్ల అంత సానుకూలంగా కనిపించడంలేదు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో జనసేన అధినేతకు బీజేపీ పూర్తిస్థాయి అండదండలు అందించింది. ఎన్నికల ప్రచారంతోపాటు, ‘వకీల్ సాబ్’ ప్రచారం కూడా చేసిపెట్టింది.
 
మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంతా చేసినా, జనసైనికుల్లో కొందరి నుంచి మాత్రం బీజేపీ పట్ల వ్యతిరేకత అలాగే వుంది. ప్రత్యేక హోదా సహా చాలా విషయాలపై జనసైనికులు, బీజేపీ తీరు పట్ల అసహనంతో వున్నారు. అన్నటికీ మించి, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కేవలం మతం కోణంలో బీజేపీ చేస్తున్న విమర్శలు జనసైనికుల్లో కొంత అలజడికి కారణమయ్యాయి. జనసేన నాయకులు, బీజేపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించినా, జనసేన ఓటు బ్యాంకు పూర్తిస్థాయిలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి పడకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అసలు వాళ్ళెవరూ పోలింగ్ బూత్ వైపు చూడకపోవచ్చన్న వాదనా లేకపోలేదు. ఏమో, ఏం జరుగుతుందో.. బీజేపీ – జనసేన మధ్య ఓటు మార్పిడి అనేది ఎలా జరుగుతుందో ఎన్నికల ఫలితాలొస్తేనే తేలుతుంది.