తెలుగు మీడియాకి చెందిన రెండు న్యూస్ ఛానళ్ళపై ఏపీ సీఐడీ రాజద్రోహం కింద కేసులు నమోదు చేసిన విషయం విదితమే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆ రెండు ఛానళ్ళు కుట్ర చేశాయన్నది ఏపీ సీఐడీ అభియోగం. ఈ దిశగా ఇప్పటికే రఘురామని అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారనుకోండి.. అది వేరే సంగతి. ఈ కేసులో తమపైనా సీఐడీ అభియోగాలు మోపడాన్ని ఆ రెండు మీడియా సంస్థలు సవాల్ చేశాయి సుప్రీంకోర్టులో. విడివిడిగా ఆయా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఏపీ సీఐడీకి షాక్ తగిలిందనీ, ఆ రెండు ఛానళ్ళకు ఊరటనిస్తూ, సుప్రీంకోర్టు.. రాజద్రోహం కేసులో విచారణపై స్టే విధించిందనీ ప్రచారం జరుగుతోంది. మరోపక్క, విచారణపై స్టే విధించలేదనీ, కేవలం.. ఆ రెండు ఛానళ్ళపై విచారణ సందర్భంగా తీవ్రమైన చర్యలు వద్దని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొందని ఇంకో వాదన వినిపిస్తోంది. ఏది నిజం.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఓ ఎంపీ మాట్లాడిన విషయాన్ని న్యూస్ ఛానళ్ళు ప్రసారం చేస్తే, దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, అదే పనిగా సదరు ఎంపీతో మాట్లాడించడం, వివాదాస్పద అంశాలపై పనిగట్టుకుని చర్చా కార్యక్రమాలు పెట్టడం ఇవన్నీ నేరపూరితమైన ఆలోచనలేనన్న వాదన అధికార పక్షం నుంచి వినిపిస్తోంది.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు సహా అనేక అంశాలపై రఘురామ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారాయన. సరే, ప్రభుత్వాన్ని ఓ రాజకీయ నాయకుడు విమర్శించకూడదా.? అంటే అది మళ్ళీ వేరే చర్చ. రాష్ట్రంలో మీడియా రెండు ప్రధానమైన రంగుల్ని సంతరించుకుందన్న విమర్శ లేకపోలేదు. వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. ఇలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో కొన్ని సంస్థలు విడిపోయాయి. అక్కడే వస్తోంది అసలు సమస్య అంతా. ఇక, ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.