హనుమంతుడు మనవాడే.. మన తెలుగువాడే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, హనుమంతుడు మన ఆంధ్రపదేశ్ బిడ్డ. ఇంకా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హనుమంతుడు రాయలసీమ బిడ్డ. ఇదెక్కడి వింత.? అని ఎవరన్నా ముక్కున వేలేసుకున్నాసరే, హనుమంతుడు తిరుమల గిరుల్లోనే పుట్టాడంటూ తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీరామనవమినాడు కుండ బద్దలుగొట్టేసిన దరిమిలా, ఇకపై హనుమంతుడు ఎక్కడ పుట్టాడు.? అటే, దానికి సమాధానం తిరుమల గిరుల్లో ఒకటైన అంజనాద్రి.. అని చెప్పక తప్పదు. అసలు ఎందుకు ఇప్పుడు ఈ అంశం తెరపైకొచ్చింది.? చాలా కష్టపడి ఎందుకు పరిశోధనలు చేసినట్లు.? ఏమోగానీ, హనుమంతుడి జన్మస్థలం ఫలానా.. అంటూ పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల గురించి వింటుంటాం. అవన్నీ అవాస్తవాలే.. అసలు సిసలు వాస్తవం, హనుమంతుడు తిరుమలలో జన్మించడం.. అని చెప్పుకోవాలి ఇకపైన.
ఈ అంశంపై వివాదాలు వస్తేనో.? వస్తాయ్.. ఖచ్చితంగా వచ్చి తీరతాయ్. రాముడు ఎక్కడ పుట్టాడు.? అన్నదానిపై వివాదం వుంది. నేపాల్ దేశంలో రాముడు పుట్టాడని అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ, అయోధ్యలోనే రాముడు జన్మించాడని మనం చెప్పుకుంటున్నాం. దేవుళ్ళకి ఈ లోకల్ ఫీలింగ్ ఏంటి చెప్మా.? అంటే అదంతే. కాదేదీ వివాదానికి అనర్హం. కాగా, పండితులు పలు రకాల శాస్త్రాల్ని, వేదాల్ని తిరగేసి.. హనుమంతుడు, తిరుమలలోని అంజనాద్రిలో జన్మించాడని తేల్చారు. తిరుమలలో పవిత్ర దర్శనీయ స్థలాల్లో ఒకటైన జాపాలి తీర్థం వద్ద హనుమంతుడి తల్లి 11 ఏళ్ళపాటు తపస్సునాచరించిందట. అద్గదీ సంగతి.