TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ బి.ఆర్ నాయుడు ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలా తిరుమల దేవస్థానంలో అన్ని విభాగాలను పరిశీలించిన ఈయన త్వరలోనే బోర్డు మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే స్వామివారు అంటే ఎంతో భక్తి కలిగినటువంటి బి.ఆర్ నాయుడు గత ఐదేళ్ల కాలంలో తాను ఒక్కసారిగా తిరుమల రాలేదని తెలిపారు.
గత ప్రభుత్వం తిరుమల తిరుపతి విధి విధానాలను పూర్తిస్థాయిలో నాశనం చేసింది అందుకే నేను ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా తిరుమలలో అడుగుపెట్టలేదని తెలిపారు. స్వామిపై ఎంతో నమ్మకం ఉన్నటువంటి తనకు ఇలాంటి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని గతంలో ఈయన తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బి.ఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పలు విషయాలు తెలిపారు.
ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి చట్టాలు చాలా బాగున్నాయి. కొత్త చట్టాలను తీసుకువచ్చే ఆలోచనలో ఏమీ లేవని తెలిపారు. అయితే కొన్ని విధివిధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వామి వారి అన్న ప్రసాదాన్ని భక్తులతో పాటు కలిసి భోంచేసిన ఈయన భక్తుల నుంచి కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్వామి వారిపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పిల్లలు వృద్దులతో కలిసి వస్తున్నారు. అయితే వారిని కంపార్ట్మెంట్ లలో గంటల తరబడి బంధించి కూర్చోబెట్టడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని ఈయన తెలిపారు.
ఈ విషయంపై భక్తులకు టైమింగ్ ట్యాగ్ ఇవ్వటం వల్ల అదే సమయానికి వాళ్లు స్వామివారిని దర్శించుకుంటారని అలా వారిని బంధించే పని ఉండదని తెలిపారు.ఇక చాలా కష్టపడి దర్శనానికి రాగా ఒక్క సెకండ్ కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించడం లేదని ఈ విషయంలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఈయన తెలిపారు. ఈ విషయంపై కూడా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక తిరుమల కొండపైకి వచ్చే సినిమా సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇకపై ఎవరైనా కొండపై రాజకీయాల గురించి మాట్లాడితే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకొనేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇలా రాజకీయాలు మాట్లాడిన వారిని వాటిని టెలికాస్ట్ చేసిన వారిపై కూడా కేసులో పెడతామంటూ బిఆర్ నాయుడు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.