Telangana: తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్ లను నియమించారు. వీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో వారందరి విషయాలను అడిగి తెలుసుకుని సర్వే చేస్తున్నారు.. ఇకపోతే ఈ సర్వేకు రాష్ట్రవ్యాప్తంగా కాస్త వ్యతిరేకత కూడా వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ సర్వే పూర్తి స్థాయిలో సహకరించి ఎన్యూమరేటర్లకు పూర్తి వివరాలను తెలియజేయగా మరికొందరు మాత్రం మా వ్యక్తిగత విషయాలు మీకెందుకు తెలియచేయాలి అంటే ప్రశ్నిస్తున్నారు.
ఇలా పూర్తి వివరాలను తెలియజేయకపోవడమే కాకుండా తమ ఇంట్లో కారు లేదా కరెంట్ బిల్లు అధికంగా వచ్చిన ఫ్రిడ్జ్ కూలర్లు వంటివి ఉంటే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తారని అందులో భాగంగానే ఈ సర్వే అంటూ కొంతమంది ఈ సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా సమగ్ర కుటుంబ సర్వే గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఒక చారిత్రాత్మకమైన సర్వే అని తెలిపారు. ఈ సర్వే కారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని అయితే ఈ విషయాలన్నింటిని కూడా చాలా గోప్యయంగా ఉంచుతామని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకం కూడా ఆగిపోదు వీలైతే మరిన్ని పథకాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ఈ సర్వేకు ఎలాంటి రాజకీయాలతో పనిలేదు ఈ సర్వే విషయంపై కేబినెట్ ఆమోదం వచ్చిన తర్వాతనే సర్వే చేయడం ప్రారంభించామని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చిన ఎన్యూమరేటర్ల పట్ల దుర్భాషలాడిన లేదా వారిపై దాడి జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఇక చాలామంది బ్యాంక్ ఖాతా గురించి అడిగితే చెప్పడం లేదని మేము బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకోలేదని కేవలం బ్యాంక్ ఖాతా ఉందా లేదా అని మాత్రమే అడుగుతున్నట్టు ప్రభాకర్ తెలిపారు. ఈ సర్వే పట్ల సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై తప్పనిసరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.