Mudragadda: ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సెక్స్ హామీలను అమలు పరచడంలో ఆలస్యం అవుతున్న తరుణంలో వైకాపా నాయకులు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు వైకాపా నాయకులు సోషల్ మీడియా వేదికగా సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల చంద్రబాబు నాయుడు గురించి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఈయన చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఏనాడు కూడా నిజం చెప్పలేదని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఈయన అబద్ధాలు చెబుతూ అధికారాన్ని అందుకుంటున్నారని తెలిపారు. అధికార దాహం తీర్చుకోవడానికి ఈయన సూపర్ సిక్స్ అంటూ దొంగ హామీలను ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ముద్రగడ తెలిపారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చాలంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడం మానేయండి. ఈ హామీలను నెరవేర్చాలి అంటే ఎంత బడ్జెట్ అవుతుందో మీకు తెలియదా. భారీ స్థాయిలో బడ్జెట్ అవసరమవుతుందని తెలిసిన ఎందుకు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు అంటూ ముద్రగడ్డ ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను అమలుపరచడంలో విఫలమైన మీరు ప్రజలకు ఈ విషయంపై ఆలోచన రాకుండా ఉండడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తీసుకువచ్చారు. ఈ లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు పడటంతో రెడ్‌బుక్ రాజ్యాంగం, సోషల్‌మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం వంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ముద్రగడ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.