Pawan -Revanth Reddy: మరాఠీ గడ్డపై తెలుగోళ్ళ సందడి.. రెండు రోజుల పర్యటనలో రేవంత్.. పవన్?

Pawan -Revanth Reddy: మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 20వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 18వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలకు గడువు ఉంది .ఈ తరుణంలోనే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం కోసం తెలుగు నేతలు అక్కడ సందడి చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కాంగ్రెస్ పెద్దలు నియమించిన విషయం తెలిసిందే. ఇక ఎన్డిఏ కూటమిలో భాగంగా బిజెపి తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇక నిన్న ఢిల్లీ వెళ్లినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ కేంద్ర మంత్రులతో కలిసారు. అయితే ఈయన నేడు మహారాష్ట్ర పర్యటనలో పాల్గొనాల్సి ఉండగా అనుకోని విధంగా తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించడంతో చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన క్యాన్సిల్ కావడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ముంబైలో రోడ్ షోలు నిర్వహించారు. అలాగే గత రెండు రోజుల నుంచి ఈయన మహారాష్ట్రలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం భారీ సభలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. అయితే తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పవన్ పర్యటన ఉన్నట్టు సమాచారం. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలంతా జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు కావడం ఆశ్చర్యకరమే అనుకోవచ్చు. మొత్తానికి మరాఠీ గడ్డపై తెలుగు నేతల హవా కొనసాగుతోంది. మరి ఈ ఎన్నికలలో అధికార పీఠం ఎవరు అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.