RK Roja: సినీనటి ఆర్కే రోజా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. ఈమె అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పై మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారికి తగిన విధంగా సమాధానాలు చెప్పేవారు. అయితే ప్రస్తుతం ఈమె ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార ప్రభుత్వాన్ని తనదైన శైలిలోనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల వైకాపా ప్రశ్నిస్తూనే ఉంటుందని తనతో పాటు తన క్యాడర్ అలాగే కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తారని తెలిపారు.
ఇలా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాము అంటే ముందు నా నుంచి అరెస్టులు కూడా మొదలుపెట్టండి అంటూ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇలా జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం పట్ల చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు నెరవేస్తారంటూ ఈమె ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రోజా తెలిపారు. తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ప్రతి 18 సంవత్సరాలు నిండి మహిళలకు నెలకు 1500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలను ఇచ్చిన కూటమి ఇప్పటివరకు ఏ ఒక్క పథకాన్ని కూడా సరైన విధంగా అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ హామీలను అన్ని వర్గాల వారికి సమన్యాయంగా అందే వరకు సోషల్ మీడియా వేదికగా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ విషయంలో తగ్గేదే లేదని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. అయినప్పటికీ తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ ఈ సందర్భంగా రోజా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.