ప‌చ్చ‌ త‌మ్ముడు కోసం రాజ్యాంగం మార్చేయాలేమో!

ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి కులం, మ‌తం, ప్రాంతం అనే బేధం ఏదీలేదు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ‌టానికి అవ‌స‌ర‌మైన అర్హ‌తలు…రాజ్యాంగానికి లోబ‌డి ఉంటే చాలు. అటుపై ఎవ‌రి ద‌మ్ము ఎంత అన్న‌ది వాళ్లే నిరూపించుకోవాలి. ఏ నాయ‌కుడిని గెలిపించాలి? అ‌న్న‌ది ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు జ‌రుగుతుంది. పార్టీలు ప్ర‌జ‌ల‌కు చేసిన మేలును బ‌ట్టి ఉంటుంది. రాష్ట్ర‌ రాజ‌కీయాల‌లో ఏ జిల్లా నుంచైనా..ఏ ప్రాంతం నుంచైనా ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా రాజ్యాంగానికి లోబ‌డి ఎవ‌రైనా పోటీ చేయొచ్చు. ఆ మాత్రం జ్ఞానం కూడా ఓ ప‌చ్చ (టీడీపీ) తమ్ముడికి లేక‌పోవ‌డ‌మే శోచ‌నీయం. ఎందుకంటే ఈయ‌న‌గారు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

వ‌ల‌స కార్మికులు అనే ప‌దం ఇప్పుడు రెగ్యుల‌ర్ గా వినిపిస్తోంది. లాక్ డౌన్ పుణ్య‌మా అని వ‌ల‌స బ్ర‌తుకులు ఎలా ఉంటాయో అంద‌రికీ అర్ధ‌మైంది. పొట్ట ప‌ట్టుకుని ఎంత దూర‌మైనా ధైర్యంగా ప్ర‌యాణించ‌గ‌ల‌రని నిరూపిస్తున్నారు. ఆ విష‌యం ప‌క్క‌న బెడితే! విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ ఇలాగే వ‌లస అంటూ నోరుపారేసుకుని అక్షింత‌లు వేయించుకుంటున్నాడు. వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ‌ల‌స జీవి అంటూ విమ‌ర్శించారు. ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తే కుద‌ర‌దు అని నోరు జారుడు. దీంతో వాసుప‌ల్లిపై ప్ర‌తి దాడి మొద‌లైంది.

ఏడాది క్రితం విశాఖ‌లో మంత్రిగా ప‌నిచేసిన గంటా శ్రీనివాస‌రావు ఎక్క‌డ నుంచి వ‌ల‌స వ‌చ్చాడు? చాలాకాలంగా విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీఎస్ మూర్తి..ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు గానీ ఆ టీడీపీ ప్రెసిడెంట్ ఎక్క‌డ నుంచి వ‌చ్చారో? తెలియ‌కుండా వ‌ల‌స అనే ప‌దం వాడేసారా? గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ జిల్లా వాసో అత‌నికి తెలియ‌దా? ఇలా తీసుకుంటే వేళ్తే చాలా పెద్ద జాబితానే వ‌స్తోంది. వాళ్ల‌ను మ‌ర్చిపోయి అవంతి మీద‌నే ప‌డ్డాడేంటి? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి.

ఎక్క‌డ నుంచో విశాఖ‌కు వ‌చ్చి డ‌బ్బులు పెట్టి రాజ‌కీయం చేసిన టీడీపీ వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ విధానాన్ని పూర్తిగా ప్రోత్స‌హించింది టీడీపీ పార్టీనే. ఎన్టీఆర్ కాలం నుంచి ఇలాంటి రాజ‌కీయాలు విశాఖ‌లో న‌డుస్తున్నాయి. మ‌రి ఈయ‌న గారికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది. వ‌ల‌స అన్నారు కాబ‌ట్టి భారత రాజ్యాంగాన్ని చంద్ర‌బాబుకు చెప్పి మార్పించాలంటూ సోషల్ మీడియా జ‌నాలు న‌వ్వుకోవ‌డం విశేషం.