Buchaiah Chowdary: ”జగన్ పతనం ఖాయం’ ఈడీ కేసుల్లో జైలు శిక్ష ఖాయం – గోరంట్ల బుచ్చయ్య చౌదరి”

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని, ఆయనపై ఉన్న అవినీతి, ఈడీ కేసులు తుది దశలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అవినీతి ఆరోపణల కేసుల్లో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు బయటకొచ్చి ‘పుష్కరోత్సవాలు’ జరుపుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. “జగన్‌పై ఉన్న కేసుల విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుల్లో ఆయనకు ఇంకెన్నేళ్లు జైలు శిక్ష పడుతుందోనని అనిపిస్తోంది” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని, అవినీతికి పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాన్ని వ్యాప్తి చేసేందుకే తాడేపల్లిలోని ప్యాలెస్‌లో ‘బూతోత్సవం’ నిర్వహించారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ, ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పట్టుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని, అయితే ప్రజలు మళ్లీ మోసపోయేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు.

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఓర్వలేక, వైసీపీ నేతలు పనిగట్టుకుని బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారని, ఈ నిజాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు.

KS Prasad Gives Clarity On Chandrababu Comments Over Medical College Privatization | Telugu Rajyam