భారతదేశ రాజకీయాల్ని శాసిస్తోన్న సోషల్ మీడియా.!

ప్రపంచం సంగతి పక్కన పెడితే, భారత దేశ రాజకీయాల్ని సోషల్ మీడియా శాసిస్తోందన్నది నిర్వివాదాంశం. ఒకప్పుడు ఇదే సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు కొనియాడాయి. ఇప్పుడు అదే సోషల్ మీడియాని తట్టుకోలేకపోతున్నాయి. ‘సోషల్ మీడియాలో ప్రజలు తమ అభిప్రాయాలు చెబితే నేరమా.?’ అని ప్రశ్నించిన పార్టీలే, అధికారంలోకి వచ్చాక, సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నవారిని వేధిస్తున్నాయి. వాళ్ళూ, వీళ్ళూ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీలదీ అదే తంతు. ప్రజల్ని వేధించింది చాలక, సోషల్ మీడియానే వేధించే స్థాయికి వెళ్ళిపోయాయి ప్రభుత్వాలన్నది ఇంకో వాదన. ఇదెంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియా వేదికలు కూడా, దేశ రాజకీయాల్ని శాసించడం మొదలు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయమిక్కడ.

‘కండిషన్స్ అప్లయ్’ అనేది సోషల్ మీడియా వేదికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా సోషల్ మీడియా సంస్థలు, తమ ఖాతాదారులకు కొన్ని నిబంధనలు పెడతాయి. కొన్ని షరతులూ విధిస్తాయి. వాటికి లోబడే ఖాతాల్ని నిర్వహించాల్సి వుంటుంది. అతిక్రమిస్తే ఆయా ఖాతాల్ని సస్పెండ్ చేస్తాయి సోషల్ మీడియా సంస్థలు. ఇక్కడా, అధికారంలో వున్నవారికి అనుకూలంగా కొన్ని సోషల్ మీడియా సంస్థలు పనిచేస్తూ, విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకిచెందిన నేతల సోసల్ మీడియా ఖాతాలు సస్పెండ్ అయ్యాయో, ఆ వెంటనే దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. అంతకు ముందు ఓ కేంద్ర మంత్రి సోషల్ మీడియా ఖాతా కూడా ఇలాగే సస్పెండ్ అయిన విషయం విదితమే. అప్పుడు అధికార పార్టీ గగ్గోలు పెట్టింది. సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తూ, ప్రజల మెదళ్లలోని ఆలోచనల్ని మార్చేసిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఆ సోషల్ మీడియాని వాడుకుంటూనే, అదే సోషల్ మీడియాపై మండిపడుతుండడాన్ని ఏమనుకోవాలి.?