బీజేపీతో పొత్తు చంద్రబాబుకు సరికొత్త సమస్యలు తెరపైకి తెస్తుందని అంటున్నారు. కొన్ని కీలక విషయాలపై దాటవేత దోరణి అవలంభిస్తారనే పేరున్న చంద్రబాబుకు ఈ సారి ఆ అవకాశం లేని పరిస్థితులు బీజేపీ వల్ల వచ్చాయని చెబుతున్నారు. కచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయని.. ఆ విషయాలపై స్పష్టత ఇవ్వకుంటే ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో టీడీపీకి పెద్ద నష్టమే కాకుండా… కూటమి అస్పష్ట రాజకీయాలవల్ల ఏపీకి తీరని నష్టం అని అంటున్నారు పరిశీలకులు!
అవును… ఇప్పటికే సీఏఏపై తన వైఖరిని స్పష్టం చేయని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మరో పిడుగు పడింది. బీజేపీ కేంద్ర నాయకత్వం “సంకల్ప్ పత్ర” పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో… ఈ ఉమ్మడి పౌరస్మృతిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా… తాము అధికారంలోకి రాగానే సీఏఏ అమలు చేస్తామని ఆ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారని అంటున్నారు పరిశీలకులు.
సీఏఏపై అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కల్యాణ్ కానీ తమ వైఖరిని స్పష్టం చేయలేదు. బీజేపీతో పొత్తు కొంతకాలమే అన్నట్లుగా కూడా స్పందిస్తున్నారు! అయితే ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ మరింత బలమైన క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో… వారితో పొత్తులో ఉన్న టీడీపీ – జనసేనల అధినేతలు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలి. అలాకానిపక్షంలోఈ ముస్లిం మైనారిటీల ఆగ్రహాన్ని పూర్తిగా చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు.
ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా కాలంగా నలుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ దాన్ని వ్యతిరేకించింది అయితే… ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నందువల్ల చంద్రబాబు ఏ విధమైన వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అలా అని ముస్లిం మైనార్టీల కొసం ఆయన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఈ స్థితిలో టీడీపీ ఆంధ్రరాష్ట్రంలో ముస్లిం మైనారిటీల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.
తాజాగా బీజేపీ చెప్పిన ప్రకరారం… అధికారంలోకి వస్తే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం తెస్తుంది! ఒక్కసారి అది చట్టం అయితే కులం, మతం, ప్రాంతం, భాష తదితర అంశాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది. వివాహం, విడాకులు, దత్తత తదితర అంశాలపై ప్రజలందరి పట్ల ప్రభుత్వం ఒక్క రీతిలో ప్రవర్తిస్తుంది.
ఇంత కీలకమైన అంశంపై టీడీపీ నాయకత్వం మౌనం వహించింది. దీంతో… ఈ మౌనం ఏపీలో కూటమికి పెను శాపంగా మారబోయే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్, వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, ఏపీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక వలంటి హామీలు ఏమీ ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తుంది. దీంతో… బీజేపీతో పొత్తు చంద్రబాబుకు ఊహించని కష్టాలు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు!