ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాల వల్ల రాష్ట్రంలో ఈ చిచ్చు రేగింది. ఈ ఘటన వల్ల ప్రజలు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కీలక ప్రక్రియ. 1885 నాటి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ను అనుమతించింది.
అవసరం అనుకున్న వారి ఫోన్లపై నిఘా ఉంచడమే. అయితే ఇది అందరికీ వర్తించదని, 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. కేవలం ఇంటిలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సీడీడీటీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్, ఎన్ ఐఏ, రా అండ్ అనాలిసిస్ వింగ్ వంటి పది సంస్థలకు మాత్రం… కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకుని అత్యంత రహస్యంగా ట్యాపింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అది కూడా దేశ భద్రతకు ముప్పు.. అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించిన విషయాలు, దేశ ఆర్థిక విషయాలను ఇతర దేశాలకు తెలియజేస్తున్న సంస్థలు, లేదా వ్యక్తులు, మాదకద్రవ్యాల రవాణా, దేశ రాజకీయ నేతలకు ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు వంటి వాటి సందర్భంలోనే ట్యాపింగ్‌ను అనుమతిస్తారు. ఇతర విషయాల్లో కానీ, రాష్ట్రాలకు కానీ, ట్యాపింగ్ అనుమతి లేదు.
అయితే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం హై కోర్ట్ లాయర్లు, టీడీపీ నేతల యొక్క ఫోన్స్ ను ట్యాపింగ్ చేసి ఉంటే అది చాలా తీవ్రమైన నేరమని, దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉంది. అయితే తాము ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, ఆ అవసరం కూడా తమకు లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు. గతంలో వైసీపీ నాయకుడు విజయ్ సాయిరెడ్డి కూడా టీడీపీ నేతలు తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసు నిలబడదని, రానున్న రోజుల్లో టీడీపీ నేతలు కూడా ఈ విషయన్నీ పట్టించుకోరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురి అవుతుందని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రాష్ట్రంలో మరో సంచలనాన్ని సృష్టించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై లేఖ రాసిన విషయం తెలిసిందే. వైసీపీ తరపున గెలిచిన రఘురామ ఇప్పుడు వైసీపీకే చుక్కలు చూపిస్తున్నారు.