అమరావతిలో దొంగలు పడ్డారు.. ఎవరా దొంగలు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వుంటోన్న అమరావతి ప్రాంతంలో రోజుకో సరికొత్త వివాదం తెరపైకొస్తోంది. మొన్నామధ్య ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ముఖ్యమంత్రి నివాసం వెనుక పేదలు నివసిస్తున్న ఇళ్ళను అధికారులు కూల్చేశారంటూ మరో వివాదం తెరపైకొచ్చింది. కాగా, రాజధాని అమరావతికి సంబంధించిన ఓ రోడ్డుని జేసీబీలతో కొందరు మట్టి దొంగలు తవ్వేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా హైకోర్టుకి కూత వేటు దూరంలో రాజధాని అమరావతి కోసం డంప్ చేసిన ఇసుక దొంగతనానికి గురైంది. అసలేం జరుగుతోంది అమరావతిలో.? వైసీపీ ఆరోపణల ప్రకారం చూస్తే, ఇదంతా పచ్చదొంగల పని.

అదే టీడీపీ ఆరోపణల కోణంలో చూస్తే, ఇదంతా బులుగు దొంగల పని. తమ ఊరికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో, వేరే చోట రోడ్డు తవ్వి, తమ రోడ్డు బాగు చేసుకున్నామని కొందరు గ్రామస్తులు రోడ్డు తవ్వకాలపై వివరణ ఇవ్వడం, దాన్ని పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయడం వివాదాస్పదమయ్యింది. మరిప్పుడు, ఇసుక దోపిడీ సంగతేంటి.? ఈ దోపిడీకి ఎవరు పాల్పడుతున్నారు.? ఇవన్నీ ఎవరు చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే, ఇలాంటి విషయాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయన్నది నిర్వివాదాంశం. రాజధాని అమరావతి విషయమై అధికార పార్టీలో కొంత చిన్న చూపు వుంది. అయితే, అమరావతితోపాటు మరో రెండు రాజధానులు నిర్మిస్తామన్నది జగన్ సర్కార్ చెబుతున్నమాట. అలాంటప్పుడు, అమరావతితో తమ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా.?