Raghurama : వైసీపీ మీద గెలిచిన రఘురామ, ఓడిన వైసీపీ ఎంపీలు.!

Raghurama : పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై గళం గట్టిగా వినిపించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ‘సాఫ్ట్ టార్గెట్’ అయ్యారు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. రెబల్ ఎంపీ మీద ఫైర్ అవడం ద్వారా, ఆ రెబల్ ఎంపీ స్థాయిని తగ్గించేందుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నించడం సహజమే కావొచ్చు. కానీ, ఈ ప్రసహనంలో రఘురామకృష్ణరాజుకి అదనపు పబ్లిసిటీ వచ్చిపడింది. అదే సమయంలో, వైసీపీ ఎంపీలు చులకనయ్యారు.

వైసీపీ ఎంపీలు తనను పార్లమెంటు సాక్షిగా దుర్భాషలాడారనీ, తనను చంపేస్తామని బెదిరించారంటూ రఘురామ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారట. ఇదే ఫిర్యాదుని లోక్ సభ స్పీకర్ ముందు కూడా రఘురామ వుంచనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో రఘురామ చాలా అడ్వాన్స్‌డ్‌గానే వుంటారు మరి.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టడంలో రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. ఆయనకు చాలా ఎక్కువ స్పేస్ లోక్ సభ సమావేశాల్లో దొరికింది కూడా. అదే విచిత్రం మరి. రాష్ట్ర సమస్యలపైనా రఘురామ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వైసీపీ ఎంపీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రస్తావించలేదని కాదు.. కానీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేశారు.? అన్నది పెద్దగా హైలైట్ కాలేదు. పోలవరంపైనా, ఇతర అంశాలపైనా విజయసాయిరెడ్డి సహా వైసీపీ ఎంపీలంతా చట్ట సభల సాక్షిగా (పార్లమెంటు, రాజ్యసభ) నినదించినా, ప్రయోజనం లేకుండాపోయింది.

రఘురామ వ్యాఖ్యలపై కేంద్రం దిగొచ్చి, ఏవో చర్యలు తీసుకుంటుందనుకుంటే పొరపాటే. కానీ, రఘురామ వ్యవహారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సో, ఎలా చూసినా, పార్లమెంటు సమావేశాల్ని వైసీపీకి చెందిన ఎంపీలందరికంటే ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ సద్వినియోగం చేసుకున్నారని భావించాల్సి వుంటుంది.