కోవిడ్ కల్లోలం: ప్రధాని నరేంద్ర మోడీకి నైతిక బాధ్యత లేదా.?

PM Modi Irresponsible Against Covid Pandemic?

PM Modi Irresponsible Against Covid Pandemic?

దేశంలో కరోనా కల్లోలొ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దేశంలో కొత్తగా దాదాపు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేటి పరిస్థితి ఎలా వుంటుందో ఏమో. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది కరోనా కేసుల పరంగా. పాజిటివిటీ రేటు అనూహ్యంగా పెరిగిపోతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా, అది జరగాల్సినంత వేగంగా జరగకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాలి. విధిగా మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా వుంచుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం.. ఇలా పలు సూత్రాలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక, పబ్లసిటీ స్టంట్లు నడిచాయి తప్ప, రాష్ట్రాలకు అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్ సరఫరా చేయలేకపోయింది మోడీ సర్కార్. వ్యాక్సిన్ విషయమై రాష్ట్రాలు, కేంద్రం వైపు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. మే 1 నుంచి పద్ధతులు కాస్త మారనున్నాయి. రాష్ట్రాలు నేరుగా కరోనా వ్యాక్సిన్ సమకూర్చుకునే అవకాశం కలగనుంది. వ్యాక్సిన్ తయారీ సంస్థలు బహిరంగ మార్కెట్ ద్వారా వ్యాక్సిన్ అమ్ముకునేందుకూ వీలు కలగనుంది. అయితే, అలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన వ్యాక్సిన్లు అందుతాయా.? తద్వారా రాష్ట్రాల కోటా కింద వ్యాక్సిన్లు ఎన్ని వస్తాయి.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

లాక్ డౌన్ పరిస్థితి రాకూడదు, అది చివరి అస్త్రం మాత్రమేనని నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సందేశమిచ్చారు. కానీ, పదుల సంఖ్యలో కేసులున్నప్పుడే లాక్ డౌన్ వాడేశాం. అది బ్రహ్మాస్త్రం కాదని తేలిపోయింది. అదే చివరి అస్త్రమని ఇప్పుడు ప్రధాని మోడీ చెప్పడంలో అర్థమే లేదు. దేశానికి అనూహ్యమైన నష్టం జరిగిపోయింది. ప్రజల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు మోడీ సర్కార్ చర్యలు చేపట్టాలి. గతంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. అని పబ్లసిటీ స్టంట్లు చేసినట్టు కాకుండా, ప్రతి ఒక్కరికీ సాయమందించేలా, ఆర్థిక సమస్యల నుంచి వెసులుబాటు కల్పించేలా మోడీ సర్కార్ చర్యలు తీసుకుంటూనే, వ్యాక్సిన్ అలాగే మందులు అందరికీ అందుబాటులో వుండేలా చేయగలగాలి. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి, వైద్యం విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చేయకపోతే కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, దేశ ప్రజల్నీ కాపాడుకోలేం.