Putin: భారత్‌పై ఎవరి ఒత్తిడి పని చేయదు.. వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు..!

నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మళ్లీ భారత్ కు వచ్చారు. ఈ కీలక పర్యటనతో భారత్–రష్యా సంబంధాలకు మరోసారి కొత్త ఊపిరి రావడం ఖాయంగా కనిపిస్తోంది. రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన బంధం ఉన్న ఈ రెండు దేశాలు.. ఈసారి మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త సంకేతాలు ఇవ్వబోతున్నాయన్న అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ పర్యటనకు ముందు ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల ప్రవర్తనపై ఆయన నేరుగా తన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికా తన అవసరాల కోసం రష్యా నుంచే అణు ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటే, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రతి దేశానికీ తన అవసరాలను తానే నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విషయంలో కూడా పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి తెరదించేందుకు ట్రంప్ నిజాయితీగా ప్రయత్నిస్తున్నారని ప్రశంసించారు. అయితే ప్రతి దేశానికి తనదైన రాజకీయ, ఆర్థిక ఎజెండా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. తమ చర్యలు ఎప్పటికీ భారత్–రష్యా సంబంధాలపై ప్రభావం చూపలేవని, ఈ బంధం ఎవరికి వ్యతిరేకంగా కూడా పనిచేయలేదని తేల్చిచెప్పారు.

భారత్–రష్యా వాణిజ్య సంబంధాలపై పుతిన్ చేసిన వ్యాఖ్యలు కూడా విశేషంగా మారాయి. భారత్‌ను రష్యన్ చమురు కంపెనీలు నమ్మదగిన కస్టమర్‌గా భావిస్తున్నాయని, ఉక్రెయిన్ యుద్ధానికి ముందే ఇరుదేశాల మధ్య బలమైన ఇంధన భాగస్వామ్యం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్యం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు.

భారతదేశం స్వాతంత్య్రం తర్వాత సాధించిన అభివృద్ధిని పుతిన్ “దాదాపు ఒక అద్భుతం”గా అభివర్ణించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడులకు లోనయ్యే వ్యక్తి కాదని, భారత్ తన దృఢమైన వైఖరిని ప్రపంచానికి ఎప్పటికప్పుడు చాటుతోందని ప్రశంసించారు. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతోందన్న సందేశాన్ని పుతిన్ ఈ వ్యాఖ్యల ద్వారా ప్రపంచానికి చేరవేశారు.