పెట్రో మాయ: ఈ పాపం కేంద్రానిదీ, రాష్ట్రాలదీ.!

Petro Price Magic

Petro Price Magic : అన్నటికీ జీఎస్టీనే.. మరి, పెట్రో ఉత్పత్తులెందుకు జీఎస్టీ పరిధిలోకి వెళ్ళవు.? ఇదే మ్యాజిక్. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.. పెట్రో ఉత్పత్తుల మీద పన్నుల పేరుతో, సగటు వాహనదారుడ్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. వాహనాలున్నోళ్ళకే కాదు, సామాన్యులకీ పెట్రో వాత పడుతుంది. ఆర్టీసీ బస్సు ఛార్జీల దగ్గర్నుంచి, కూరగాయల ధరల వరకు.. అన్నీ పెట్రో ధరల మీద ఆధారపడి వుంటుంది వ్యవహారం.

దాదాపు 50 రూపాయల మేర మోడీ సర్కారు హయాంలో లీటర్ పెట్రోలు మీద వడ్డన చూశాం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగింది ఇప్పుడే. గతంలో అనూహ్యంగా తగ్గాయ్. కానీ, ఆ తగ్గుదల వల్ల సామాన్యుడికి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడూ పెరిగాయ్.. ఇప్పుడూ పెరిగాయ్.

‘మేం జనాన్ని ఉద్ధరించేవాం..’ అంటూ లీటర్ పెట్రోల్ మీద 8 రూపాయల సుంకాన్ని తగ్గించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేసుకున్నారు. పెంచినప్పుడు, ‘మేం దోచేస్తున్నాం..’ అని ఎందుకు చెప్పుకోలేదో మరి.!

‘అబ్బే, మాకేం సంబంధం లేదు. కేంద్రమే పెంచింది.. కేంద్రమే తగ్గించాలి..’ అని రాష్ట్రాలు అంటున్నాయి. పెట్రో ధరలకు అనుగుణంగా రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయం రాష్ట్రాలు కొంత మేర తగ్గించుకుంటే, ప్రజలకు ఊరట దొరుకుతుంది కదా.?

ఒక్కటి మాత్రం నిజం, దేశంలో పెట్రో ఉత్పత్తుల పేరుతో నీఛ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన ప్రభుత్వాలు, నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు.. రెండిటిదీ ఒకటే ధోరణి. పెంచింది 50.. తగ్గించింది పది కూడా కాదు.. అని రాష్ట్రాలు అంటున్నాయ్. అదీ నిజమే. కానీ, కేంద్రం తగ్గించినదానికి అనుగుణంగా రాష్ట్రాలూ తగ్గించాల్సిందే. అప్పుడే, సామాన్యుడికి కాస్తన్నా ఊరట లభిస్తుంది.