భవిష్యత్తులో మనిషికో ఆక్సిజన్ సిలిండర్ తప్పదా.?

oxygen cylinder

oxygen cylinder

చెట్లను నరికి పారేస్తున్నాం.. అంతా కాంక్రీట్ జంగిల్ మాత్రమే.. ఇక ఆక్సిజన్ ఎలా లభ్యమవుతుంది.? చాలాకాలంగా వినిపిస్తోన్న వాదనే ఇది. ఆకాశహర్మాల విషయంలో కనిపిస్తున్న శ్రద్ధ చెట్లను పెంచడంలో కనిపించడంలేదెవరికీ. ప్రభుత్వాలైతే, చెట్ల పెంపకాన్ని ఓ పబ్లసిటీ స్టంటుగానే చూస్తున్నాయి. దాంతో, పచ్చదనం పూర్తిగా కరవవుతోంది. అయితే, ఈ చెట్ల నరికివేత అనేది ఎంతటి ప్రమాదకరమో.. ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసొస్తోంది. మన భూమ్మీద ఆక్సిజన్ లభ్యత అత్యధికంగా చెట్లనుంచే జరుగుతుంది. గత కొంతకాలంగా ఆ చెట్లకే కష్టమొచ్చింది. సరే, ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మనిషికో ఆక్సిజన్ సిలెండర్ తప్పేలా లేదు. సమీప భవిష్యత్తులో జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకున్నట్లుగా ఓ ఆక్సిజన్ సిలెండర్ చిన్నదే అయినా తమ వెంట తీసుకెళ్ళక తప్పకపోవచ్చు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సమస్య గురించి చాలా ఎక్కువగా వింటున్నాం.

ఆక్సిజన్ లేక చాలా ప్రాణాలు పోతున్నాయి. ఆక్సిజన్ విషయమై రాత్రికి రాత్రి కళ్ళు తెరుస్తోన్న పాలకులు, విదేశాలనుంచి ఆక్సిజన్ సిలెండర్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అదే చెట్లను విరివిగా పెంచినట్లయితే, కొంతమేర ఈ తీవ్రత తగ్గదన్న అభిప్రాయం పర్యావరణ ప్రేమికుల నుంచి వ్యక్తమవుతోంది. గాల్లో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆ విషయమై జనానికి పెద్దగా బెంగ లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే, భయంకరమైన పొల్యూషన్ బయట వున్నా, ఎంచక్కా రోడ్ల మీద తిరగడం ఓ ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. ఇకపై అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే, కరోనా వచ్చినవారికి ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువగానే వస్తున్నాయి. కొంతమందిలో ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటున్నాయి. ఇలాంటివారంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ తప్పక పీల్చాల్సి వుంటుంది. ప్రభుత్వాలు చెట్ల పెంపకాన్ని పబ్లిసటీ స్టంటుగా కాకుండా బాధ్యతగా చేయాలి. అదే సమయంలో ప్రజలూ, చెట్లను కొట్టేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.