Shivalinga : దేశంలో ఎన్నో శివాలయాలున్నాయ్. వాటిలో ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలు చోటు చేసుకున్నాయ్. కొన్ని ఆలయాలకు సంబంధించి ఎంత ప్రయత్నించినా అంతు చిక్కని రహస్యాలెన్నో దాగున్నాయ్. ఇంతకీ మనం చెప్పుకోబోయే ఈ శివాలయం సంగతేంటంటారా.? అచ్చు పురుషాంగాన్ని పోలి వుంటుందీ లింగం.
చిత్తూరు జిల్లా గుడిమల్లం అనే ఓ చిన్న గ్రామంలో వుంది ఈ విచిత్రమైన శివాలయం. సరిగ్గా చెప్పాలంటే, తిరుపతికి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో అన్నమాట. ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలోని గర్భగుడి, గుడి మండపం కన్నా చాలా లోతులో వుంటుంది. అందుకే ఈ ప్రాంతానికి ‘గుడిమల్లం’ అనే పేరొచ్చిందని అక్కడి స్థానికులు చెబుతారు.
ఇక్కడి శివలింగం చాలా చాలా పురాతనమైనదని చెబుతారు. ఎక్కడైనా శివుడు లింగాకారంలోనే వుంటాడు. కానీ, ఇక్కడ లింగాకారంతో పాటు, మనిషి రూపంలోనూ దర్శనమిస్తాడు శివుడు. అచ్చు పురుషాంగాన్ని పోలినట్లుండే శివలింగంపై మనిషి రూపంలో శివుడి ప్రతిమ ప్రతిష్ఠించబడి వుంటుంది.
ఎందుకు ఈ శివలింగం ఇలా చెక్కబడిందన్న రహస్యం ఇప్పటికీ మిస్టరీనే. అసలీ శివలింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారన్న విషయం పైనా సరైన ఆధారాలు దొరకలేదట. టెక్నాలజీ ఇంతలా పెరిగిన ఈ కాలంలో కూడా పురావస్తు శాఖ వారు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఈ శివలింగం రహస్యాన్ని ఛేదించలేకపోయారు.
అయితే, ఇంత అరుదైన గొప్ప శివాలయం బాహ్య ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. సుమారు ఏడు అడుగుల పొడవున్న ఈ శివలింగాన్ని ‘పరశురామేశ్వరుడు’ అనే పేరుతో ఆ ప్రాంత వాసులు అతి పవిత్రంగా పూజిస్తున్నారు.