KCR : ఎర్ర పార్టీలతో కేసీయార్ కొత్త వ్యూహం.! రైటా.? రాంగా.?

KCR :  రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. పొత్తులు కుదరకపోతే ‘అవగాహన’ కూడా మామూలే. ఇవేవీ సెట్టవకపోతే, తెరవెనుకాల లాలూచీలు కూడా నడుస్తుంటాయి. వామపక్షాల్ని గతంలో తోకపార్టీలుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. అవసరమైనప్పుడు, ఆ పార్టీల్ని ఆయన కలుపుకుపోతుంటారు కూడా.

తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మరికొందరు ఎర్ర పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయితే వింతేముంది.? కానీ, ఇక్కడ రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య కూడా భేటీ జరిగింది. దాంతో, ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది.

జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్న కేసీయార్, అతి త్వరలో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో వామపక్షాల్ని కూడా కలుపుకుపోవాలన్నది కేసీయార్ ఆలోచనగా కనిపిస్తోంది.

జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే ముఖ్యమంత్రుల్నీ కేసీయార్ ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారట. అయితే, కేసీయార్‌ని అంత తేలిగ్గా ఈ విషయంలో నమ్మడానికి వీల్లేదు. తిట్టిన నోటితో పొగడటం, పొగిడిన నోటితో తిట్టడం కేసీయార్‌కి అలవాటైపోయిన విద్య.

వామపక్షాలు గనుక కేసీయార్ ట్రాప్‌లో పడితే, ‘తోక పార్టీలు’ అన్న విమర్శని కేసీయార్ నుంచే ఇంకోసారి ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందర్నీ ముంచేసి, బీజేపీతో కేసీయార్ అండ్ టీమ్ చెట్టపట్టాలేసుకు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.