కడప ఉక్కు పరిశ్రమ అనేది ఏళ్ళ నాటి కల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగాల్సి వుంది. కానీ, అప్పట్లో ఈ ఉక్కు పరిశ్రమ పేరుతో జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. చివరికి ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన భూముల్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నాటకకు చెందిన బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి అప్పట్లో ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం హడావిడి చేశారు.
ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన తర్వాత చంద్రబాబు హయాంలో కూడా కడప ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమాలు జరిగాయి. నిరాహార దీక్షలూ చూశాం. అయినా కేంద్రం పట్టించుకోలేదంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేసేసి, పైలాన్‌ని ఆవిష్కరించేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంతు. వైసీపీ ప్రభుత్వం కూడా కడపలో ఉక్కు పరిశ్రమ కోసం పైలాన్ ఆవిష్కరించేసింది. దీనికి తాజాగా కేంద్రం నుంచి అనుమతులూ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఓ పక్క విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రచ్చ జరుగుతన్న సమయంలో కేంద్రం నుంచి కడప ఉక్కు పరిశ్రమ కోసం అనుమతులు రావడం ఆశ్చర్యకరం. కడప ఉక్కు పరిశ్రమ అనేది విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన హక్కు.
ఉక్కు పరిశ్రమ, దాంతోపాటుగా దుగరాజపట్నం పోర్టు.. విభజన చట్టంలో వున్నాయి. దుగరాజుపట్నంకి బదులుగా రామాయపట్నం పోర్టుని రాష్ట్రం, కేంద్రానికి ప్రతిపాదన పంపితే, కొర్రీలు పెట్టి.. సాధ్యం కాదని తేల్చేసింది కేంద్రం. ‘అమ్మడానికి కుదరకపోతే, మూసేస్తాం..’ అని విశాఖ ఉక్కు గురించి కేంద్రం స్పష్టం చేస్తున్న వేళ, కడప ఉక్కు పరిశ్రమ ఏమవుతుంది.? ప్రభుత్వానికి చేతకాని పరిశ్రమల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు ఎలా లాభదాయకమవుతుంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కడప ఉక్కు అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే వుంది.