దేశంలో 20 కోట్ల మందికి పైగా డోసుల కరోనా వ్యాక్సిన్.. ప్రజలకు అందించగలిగినట్లు కేంద్రం చెబుతోంది. 20 కోట్ల డోసులు.. అన్న మాట వినడానికి బాగానే వున్నా, దాదాపు 140 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశంలో, 20 కోట్ల డోసులంటే చిన్నమాటే.
వీరిలో రెండు డోసులు పూర్తి చేసుకున్నవారెంతమంది.? అసలు ఒక్క డోస్ లేదా రెండు డోసులు తీసుకున్నవారిలో ఎంతమందికి కరోనా తిరిగి సోకింది.? వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ కరోనా మరణాలు సంభవించాయా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు.
ఎయిమ్స్ తాజా అధ్యయనంలో 63 మంది ఆరోగ్య పరిస్థితి తాలూకు వివరాలు చిత్రంగా వున్నాయి. వీరిలో 37 మందికి రెండు డోసులూ ఇచ్చారట. 27 మందికి మాత్రం సింగిల్ డోస్ మాత్రమే అందింది. రెండు డోసులు తీసుకున్నవారిలో 52.8 శాతం మంది కరనాబారిన పడ్డారట. ఒక్క డోసు తీసుకున్నవారిలో 47.2 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది.
అంటే, ఒక్క డోసు తీసుకున్నవారికైనా, రెండు డోసులూ తీసుకున్నవారికైనా కరోనా వచ్చే అవకాశం 50 శాతం వున్నట్టే కదా.? వ్యాక్సినేషన్ అందరికీ పూర్తయినాగానీ, ఇవే గణాంకాలు వర్తిస్తాయనుకుంటే.. వ్యాక్సినేషన్ వల్ల పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. తీవ్ర అనారోగ్యం, మరణాల నుంచి మాత్రం వ్యాక్సినేషన్ ఉపశమనం కలిపిస్తుందన్నది ఆయా అధ్యయనాల సారాంశం. ఇది కొంత సానుకూల అంశమే.
అయినాగానీ, వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో ఎప్పటికి పూర్తవుతుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రాలో గ్లోబల్ టెండర్లకు పిలుపునిస్తే, ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. కేంద్రమేమో మొత్తంగా వ్యాక్సిన్లను సేకరించి, రాష్ట్రాలకు ఇవ్వలేమని చెబుతోంది. కొంతవరకే తమ బాధ్యత.. అని కేంద్రం తెగేసి చెప్పేసింది.
ఇప్పుడెలా.? ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా కొట్టుమిట్టాడాల్సిందేనా.? వ్యాక్సినేషన్ విషయమై కేంద్రమెందుకు వాస్తవాలు చెప్పలేకపోతోంది.? ఏమోగానీ, భారతదేశం చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభాన్ని పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎదుర్కొంటోందన్నది నిర్వివాదాంశం.