“చిందింది రక్తం చుండూరులోన…”

Chunduru village

“చిందింది రక్తం చుండూరులోన – ఆగస్టు ఆరు తొంబై ఒకటిన” అంటూ సాగే పాట 1990 దశకంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆ తర్వాత ఢిల్లీ వీధుల్లో, డర్బన్ మహాసభల్లో కూడా మారుమోగింది.

మిత్రుడు, సహచరుడు, న్యాయవాది, ఉద్యమకారుడు దివంగత ఏ వై (శీలం) ప్రభుదాసు రాసిన పాట ఇది. గుంటూరు నుండి చుండూరు వెళ్ళే దారిలో ఇద్దరం పడ్డ అక్షర ప్రసవవేదన ఫలితం. ఇదీ ఈ పాట నేపథ్యం.

అప్పటికే “హైదరాబాద్ బుక్ ట్రస్టు” వారు ప్రచురిస్తున్న “నలుపు” పక్షపత్రిక నుండి బయటకు వచ్చేశాను.

ఏప్రిల్ 14, 1991న విజయవాడ గాంధీజీ హై స్కూల్ లో డాక్టర్ కత్తి పద్మారావు నేతృత్వంలో జరిగిన అంబేద్కర్ శతజయంతి మహాసభలో నా పెళ్ళి జరిగింది.

ఆ తర్వాత ఇంకో మిత్రుడి వివాహం కోసం మధురై వెళ్ళాం. తిరిగి జూన్ లో గుంటూరు వచ్చి మిత్రుడు ప్రభుదాసు, నేను, ఇంకొందరు మిత్రులు కలిసి బ్రాడీపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం.

అక్కడే అందరం కలిసి ఉంటూ ఉద్యమం పేరుతో గ్రామాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. చాలా మంది మిత్రులు, బాధితులు వస్తూ, పోతూ ఉండేవారు.

ఆగస్టు 6 ఉదయం బ్రాడీపేట ఇంట్లో ఇంకా నిద్ర లేవలేదు. ఎవరో తలుపు కొడుతుంటే నిద్ర లేచి తలుపు తీస్తే ఎదురుగా ఏడుస్తూ, భయంతో వణికిపోతూ ఒక యువకుడు కనిపించాడు. చుండూరు పక్క గ్రామం. “అన్నా చుండూరులో మనవాళ్ళను రెడ్లు చంపేశారన్నా” అంటూ బావురుమన్నాడు.

మిత్రుడు ప్రభుదాసు కూడా నిద్రలేచాడు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాం. నేరుగా పంట పొలాల్లోకి చేరుకున్నాం.

పంటపొలాల్లో ఎటు చూసినా రక్తం మరకలు. కొన్ని శవాలు బురదలో, మరికొన్నిశవాలు గోనె సంచుల్లో మూట కట్టి. కాలవలో…ముళ్ళ పొదల్లో… మల్లె మొక్కల్లో… రైల్వే ట్రాక్ పక్కనా…

ఇలా శవాలు ఎక్కడపడితే అక్కడ… శరీరాలు ముక్కలై… కొన్ని ఇంకా నెత్తురోడుతూ… మాంసం ముద్దలుగా…

అప్పటికే బాగా తెల్లారింది. పోలీసులు గ్రామాన్ని దిగ్బంధనం చేశారు. శవాలతో మేము గ్రామం లోపలే ఉండిపోయాం. బయట నుండి ఎవరినీ గ్రామంలోకి అనుమతించడం లేదు.

కత్తి పద్మారావు రంగప్రవేశం చేశారు. విజయవాడ యూఎన్ ఐ వార్తా సంస్థ ప్రతినిధి బాలమురళీకృష్ణ కారులో వచ్చారు. యూఎన్ ఐ వార్తా సంస్థ ఫోటోగ్రాఫర్ అవతారంలో పద్మారావు వచ్చేశారు.

పద్మారావు రంగ ప్రవేశంతో ఆ చిందిన రక్తం ఎర్ర సముద్రం అయింది. తెగిపడిన తలలు పులి గొంతులై గాండ్రించాయి.

రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెట్టలేదు. కన్నెర్ర చేశాయి. భుజం తట్టి చుండూరుకు అండగా నిలబడ్డాయి.

ఇక మిగిలినదంతా చరిత్ర. ఆత్మ గౌరవ చరిత్ర.