విజయవాడ వెస్ట్… సుజనా చౌదరికి ఇంటా, బయటా సమస్యలివే!

ఏపీ బీజేపీ తమ ఎమ్మెల్యే అభర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో కూడా చాలా మంది ఊహించినట్లుగానే మెజారిటీ వాటా చంద్రబాబు వర్గంగా పేరున్న వారికే దక్కింది! ఒరిజినల్ బీజేపీ నేతలను పక్కనపెడుతూ.. చంద్రబాబుకు సన్నీతులుగా చెప్పుకునే వారికే సీట్లు దక్కాయి. ఇది బాబు గొప్పతనమా.. బీజేపీ చేతకానితనమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ లిస్ట్ పై బీజేపీ ఒరిజినల్ కార్యకర్తలు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు!

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఎచ్చెర్ల – ఈశ్వర్ రావు.. విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు.. అరకు వ్యాలీ – రాజారావు.. అనపర్తి – శివకృష్ణంరాజు.. కైకలూరు – కానినేని శ్రీని శ్రీనివాస్.. విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి.. బద్వేల్ – బొజ్జ రోశన్న.. జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి.. ఆదోని – పార్ధసారధి.. ధర్మవరం – వై సత్య్య కుమార్ లు ఉన్నారు.

మిగిలిన వారి సంగతి కాసేపు పక్కనపెడితే… అనూహ్యంగా అసెంబ్లీ టిక్కెట్ సంపాదించుకున్న సుజనా చౌదరి పోటీ చేసే స్థానం ఇప్పుడు ఆసక్తిగా మారింది! వాస్తవానికి సుజనా చౌదరి లోక్ సభకు పోటీచేస్తారనే అంతా భావించారు. అయితే… పురందేశ్వరి ప్లాన్ లో భాగంగా ఆయనను అసెంబ్లీకి పంపించారని చెబుతుంటారు! ఈ సమయంలో సుజానా చౌదరి విజయవాడ వెస్ట్ కి రావడంతో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా… విజయ్వాడ వెస్ట్ లో టీడీపీ టిక్కెట్ ఆశించిన బలమైన నేతలు ఉన్నారు. వారిలో ప్రధానంగా ముస్లిం కోటా నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ ఉండగా.. టీడీపీ కోసం అవిరామంగా పోరాడుతూ నిత్యం మీడియాలో క‌న‌ప‌డే బుద్ధా వెంక‌న్న మరొకరనే చెప్పాలి. ఈ సమయంలో వీరిద్దరిలో ఒకరి కాకుండా బుజేపీకి కేటాయించి, అక్కడ నుంచి సుజనా చౌదరిని తెచ్చి పోటీకి నిలబెట్టడాన్ని వీరు, వీరి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది.

దీంతో… కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సుజనా చౌదరికి వీరి మద్దతు ఏ మేరకు ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విజయవాడ వెస్ట్ లో ముస్లిం ఓటు బ్యాంక్ కూడా అత్యంత కీలకమైన పరిస్థితి! ఈ సమయంలో… షేక్ అసీఫ్ అనే సమాన్యుడికి టిక్కెట్ కేటాయించారు జగన్. మరోపక్క ధనవంతుడైన సుజనా చౌదరిని నిలబెట్టింది కూటమి. దీంతో… విజయవాడ వెస్ట్ లో క్లాస్ వార్ జరగబోతోందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో.. టిక్కెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేతల నుంచి సుజనా చౌదరికి ఎలాంటి మద్దతు లభించబోతోందనేది ఆసక్తిగా మారడంతోపాటు.. తెరవెనుక ఎలాంటి దెబ్బకొట్టే అవకాశం ఉందనే చర్చ కూడా తెరపైకి వచ్చింది! ఇటు ముస్లిం ఓటు బ్యాంకు, అటు టీడీపీ అసంతృప్తుల నిర్ణయాల ఒకవైపు అయితే… మరోవైపు జనసేన నుంచి సుజనా చౌదరికి పెద్ద గండమే ఉందని అంటున్నారు.

జనసేన కోసం కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ.. పవన్ కు సన్నిహితుడిగా పేరు సంపాదించుకుని.. పవన్ తో టిక్కెట్ కూడా కన్ ఫాం అని చెప్పించుకుని, రంగంలోకి దిగిన పోతిన మహేష్ పరిస్థితి ఇప్పుడు దయణీయంగా ఉందని అంటున్నారు. టిక్కెట్ కోసం నిరసన దీక్షకు దిగిన పరిస్థితి పోతిన మహేష్ ది! జనసేనలో పార్టీకోసం కష్టపడిన నలుగురి పేర్లు చెప్పమంటే.. అందులో ఖచ్చితంగా పోతిన మహేష్ ప్రస్థావన వస్తుంది.

అలాంటి పోతిన మహేష్ కు జనసేనాని తనదైన స్ట్రోక్ ఇచ్చారు. పైగా.. పార్టీ చెప్పినట్లు వినకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ అటు నాగబాబు, ఇటు పవన్ బాబులు జనసైనికులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో… పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో… జనసైనికుల నుంచి సుజనా చౌదరికి దొరికే మద్దతుపై నీలి నీడలు కమ్ముకున్నాయని అంటున్నారు.

ఇన్ని ఇంటర్నల్, ఎక్స్ ట్రనల్ సమస్యల మధ్య విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతోన్న సుజన చౌదరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి!!