బిగ్ ట్విస్ట్… బెజవాడలో ఇప్పుడు వంగవీటి వంతు!

ఎన్నికలకు ఇంకా కాస్త అటు ఇటుగా 100 రోజులు ఉన్నాయని అంటున్న సంగతి తెలిసిందే. ఈలోపులోనే ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా అటు గోదావరి జిల్లా రాజకీయాలు, ఇటు బెజవాడ రాజకీయాలు దద్దరిల్లగొట్టేస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో రీసౌండ్ వస్తుంది. ప్రస్తుతం కాపు సామాజిక వర్గ కేంద్రంగా నడుస్తున్న ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు వంగవీటి వంతు వచ్చింది.

అవును… ఏపీ రాజకీయాలు ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ వీలైనంతవరకూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటున్న సమయంలో… బీసీలలో ఒక పర్సంటేజ్ ఓట్లు ఎలాగూ తమకు ఉంటాయి, ఇక వాటికి కాపు ఓట్లు తోడయితే చాలనే ఆలోచనతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అయితే… గోదావరి జిల్లాల్లో కాపు, బీసీ ఓట్లను ఏ మేరకు ఒకతాటిపైకి తెస్తారనేది వేచి చూడాలి!

ఆ సంగతి అలా ఉంటే… టీడీపీకి బలమైన కృష్ణాజిల్లాలో అటు కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతల్లో ఒకరైన కేశినేని నానీ వైసీపీలో జాయి అయ్యారు. కృష్ణాజిల్లా రాజకీయాల్లో వైసీపీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు పరిశీలకులు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని మొదలైన కమ్మ సామాజికవర్గ నేతలు అంతా ఒకతాటిపైకి రావడం కచ్చితంగా వైసీపికి కలిసొచ్చే అంశమే అని అంటున్నారు.

ఈ సమయంలో కాపు సామాజంలో కీలకమైన వంగవీటి మోహన రంగా కుమారుడు రాధాకు వైసీపీ నుంచి ఆఫర్ ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఇంచార్జ్ గా ప్రకటించినా రాధా వైసీపీలో చేరితే ఆ సీటు ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాధాను ఫ్యాన్ కిందకు తీసుకురావాలని గట్టిపట్టుదల మీద వైసీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు.

వాస్తవానికి గతంలో రాధా వైసీపీని వీడిపోవడానికి కారణం కూడా విజయవాడ సెంట్రల్ సీటని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్నా విజయవాడ సెంట్రల్ సీటు దక్కే ఛాన్స్ లేదు. ఇప్పటికే ఆ సీటుని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు కేటాయించారు. అయితే.. పార్టీ అధికారంలోకి వస్తే రాధాకు ఏదైనా పదవి ఇస్తామని చెబుతున్నారట కానీ… అందుకు రాధా ఏమాత్రం సానుకూలంగా లేరని సమాచారం.

దీంతో కృష్ణాజిల్లాలో అటు కమ్మ, కాపు లను బ్యాలెన్స్ చేసే దిశగా జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా… పవన్ కల్యాణ్, ముద్రగడ వంటివారు జై చంద్రబాబు అని అంటున్న నేపథ్యమంలో… వంగవీటి రంగా కుమారుడు మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిలబడబోతున్నారని కథనాలు వస్తుండటం కాపు వర్గంలో బలమైన చీలికను తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.