ఆర్థిక సంక్షోభం దిశగా ఏపీ..భయపెడుతున్న కాగ్ రిపోర్ట్!

అంధ్ర ప్రదేశ్ పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు అనే చందగా మారింది. రోజు రోజుకు అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి.. ఈ మాట అన్నది ప్రతిపక్షాలో.. ఆర్థిక నిపుణులో.. మీడియానో కాదు.. కాగ్ రిపోర్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏపీ ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తొందని కాగ్ రిపోర్టు తేల్చింది. రాష్ట్రం పది నెలలకు తీసుకున్న రుణం 73,913 కోట్ల రూపాయలకు చేరిందని నివేదికలో కాగ్ పేర్కొంది. బడ్జెట్‌లో అంచనా .48,295 కోట్లు కాగా.. ఇది అంచనాకన్నా 153 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు దారుణంగా పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ఇది 300 శాతం అధికమని కాగ్ అంటోంది.

బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అంచనా 18,434 కోట్ల రూపాయలు ఉండగా.. అసలు రెవెన్యూ లోటు 54,046 కోట్ల రూపాయలు ఉందని రిపోర్టులో ప్రస్తావించింది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు 46,503 కోట్లు తీసుకుందని, బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకున్నా.. ఏపీ స్టేట్‌ అవసరాలు తీరలేదని నివేదికలో కాగ్ పేర్కొంది. డిసెంబర్‌లో 30 రోజుల స్పెషల్‌ డ్రాయింగ్‌ ,26 రోజుల చేబదుళ్లు.. మూడు రోజుల ఓవర్‌ డ్రాఫ్ట్‌‌ను కాగ్ పరిశీలిచింది.

అయితే గతంతో పోల్చుకుంటే ఏపీకి రెవెన్యూ రాబాడి కూడా బాగానే పెరిగింది. కానీ సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుందని కాగ్ అభిప్రాయపడింది. మార్కెట్ ద్వారా నిధుల సేకరణతో పాటూ ఏపీ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా రుణాలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది కాగ్ నివేదిక చూస్తే అర్థమవుతోంది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకుని.. ఇంకా రుణాలు తీసుకునేందుకు అవకాశాలు లేనప్పుడే ఈ మూడు మార్గాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుందని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించి అనుకునులోగా కాగ్ బాంబ్ పేల్చిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 18వ విడత జీఎస్టీ పరిహారం కింద మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో ఏపీకి 2306.59 కోట్ల రూపాయలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద 5,051 కోట్ల రూపాయలు, స్పెషల్ విండో ద్వారా 2, 306 కోట్ల రూపాయలు, స్పెషల్ విండో ద్వారా 2,306 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.