ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో అవాంఛనీయమైన, అవసరం లేని ఓ చర్చ జరుగుతోంది. ఎవరు సింహం.? ఎవరు గ్రామ సింహం.? అన్నదానిపై చర్చ జరుగుతోంటే, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు, ‘ఓ కుక్క బాగా మొరుగుతోంది..’ అని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.
సోషల్ మీడియాలో లోకేష్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరోపక్క, అధికార వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ చాలా తీవ్రస్థాయిలో మొదలైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కొడాలి నాని తదితరులు నారా లోకేష్ మీద విరుచుకుపడ్డగారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు, కొడాలి నాని హెచ్చరికలతో వివాదం మరో స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎవరు సింహం.? ఎవరు గ్రామ సింహం.? అన్నదానిపైనే ఈ చర్చ అంతా. అసలు ఇది అవసరమా.? అన్నది సామాన్యుల వాదన.
లోకేష్ హుందాతనం మర్చిపోయారు సరే, అధికార పార్టీ బుద్ధి ఏమయ్యింది.? అన్న చర్చ వినిపిస్తోంది ప్రముఖంగా. మరోపక్క లోకేష్ తన స్థాయిని మరిచి వ్యాఖ్యానించడం వల్లే ఈ దుమారం అన్నది మరికొందరి వాదన. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ఎప్పుడూ అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ రచ్చ మాత్రమేనా.? కేంద్రాన్ని ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై నిలదీసేది ఏమన్నా వుందా.? అని జనం ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ప్రతిపక్షం, కేంద్రంపై మండిపడాలి. అధికార పక్షం కూడా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, ఇటు టీడీపీనీ.. అటు వైసీపీనీ విమర్శిస్తున్నా.. బీజేపీని నిలదీయలేని దుస్థితి ఈ రెండు పార్టీలది. ఎవరూ సింహాలు కాదనడానికి ఇదే నిదర్శనం.. అని బీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీల విమర్శలు చేస్తున్నారు.