Atchannaidu: రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ ప్రాంతానికి తీరని ద్రోహం చేసింది మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే, అంటే 2020లోనే ఆగిపోయిందని స్పష్టం చేశారు. “వైసీపీ పాలనలో ఎవరో ఎన్జీటీకి (NGT) వెళ్తే స్టే ఇచ్చింది వాస్తవం కాదా? మీ అసమర్థత వల్ల ఆగిపోయిన ప్రాజెక్టును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపిందంటూ సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు రాయించడం సిగ్గుచేటు” అని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు పనైనా ఆగిందని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

తెలంగాణ ముఖ్యమంత్రితో ఉన్న సంబంధాలపై వస్తున్న విమర్శలకు అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. “వ్యక్తిగత సంబంధాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదు” అని ఆయన తేల్చి చెప్పారు. తన స్వార్థం కోసం రాయలసీమ ప్రాజెక్టులను గాలికొదిలేసిన చరిత్ర జగన్‌దేనని విమర్శించారు.
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ వాసులకు జగన్ చేసిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని అన్నారు.
రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మరు. గత ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని జగన్, ఇప్పుడు ద్రోహం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

