Ambati : అంబటీ, ఆ పొత్తుకు చిత్తయ్యింది వైసీపీనే.!

Ambati : ఏదో సెటైర్ వేసేశాననుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారుగానీ, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఆ సెటైర్‌కి కానుకగా బోల్డన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పొత్తులు చిగురిస్తున్నాయి. టీడీపీ – జనసేన మధ్య పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబు నుంచి ప్రేమలేఖలు షురూ అయ్యాయి. జనసేన మాత్రమే కాదు, బీజేపీ కూడా తమతో పాటు కలిసి రావాలన్న భావన టీడీపీలో కనిపిస్తోంది.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. ఆ లెక్కన, ఇంకోసారి ఆ పొత్తు ఖాయమైతే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అధికార వైసీపీ, వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. రాజకీయాల్లో నిన్నటి ఈక్వేషన్స్, నేటి ఈక్వేషన్స్, రేపటి ఈక్వేషన్స్.. ఒకేలా వుండవ్. ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి.

పైగా, గతంలో వైసీపీని దెబ్బ కొట్టిన ఈ కూటమి, ఈసారి మళ్ళీ దెబ్బకొట్టదన్న గ్యారంటీ ఏముంది.? పొత్తు వున్నా.. లేకున్నా.. చిత్తు చిత్తే.. అంటూ అంబటి రాంబాబు వేసిన సెటైర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 2014 ఎన్నికల నాటి ఫలితాల గురించి అంబటి రాంబాబుకి ఉద్భోద చేస్తున్నారు కొందరు వైసీపీ మద్దతుదారులు.

కాగా, టీడీపీ అలాగే జనసేన మద్దతుదారులు.. ఇంకోపక్క బీజేపీ మద్దతుదారులు అంబటి రాంబాబు మీద వేస్తున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. ఏదిఏమైనా, అధికార వైసీపీ ఈసారి ఇంకాస్త అప్రమత్తంగా వుండాల్సింది. కింది స్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకత, పార్టీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు.. వీటన్నినీ సరిదిద్దుకోకుండా రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేసి ప్రయోజనం లేదు.

అన్నట్టు, అంబటి రాంబాబుకీ సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చే ఎన్నికల్లో వుండొచ్చన్న ప్రచారం జరుగుతున్న దరిమిలా, ఆయన వచ్చే ఎన్నికల్లో గెలవడమెలాగదన్నదానిపై దృష్టిపెడితే మంచిదే.