ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఒక క్లారిటీకి వచ్చేసి, మేనిఫెస్టోల ప్రిపరేషన్ పై దృష్టిసారించాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన ఆ మేనిఫెస్టోల విడుదలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు.
మరోపక్క భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా “సిద్ధం” అని అధికారపార్టీ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. “జెండా” అంటూ టీడీపీ – జనసేన కూటమి ఉమ్మడి సభలు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ఫలితాలపై అంచనాలు తెరపైకి వస్తున్నాయి.. పలు సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే పలు సర్వే ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అందులో మెజారిటీ ఫలితాలు ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి కన్ ఫాం అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో మరోసారి వైసీపీ సత్తా చాటుతుందని.. మెజార్టీలో తేడా ఉండొచ్చు కానీ గెలుపు మాత్రం పక్కా అని చెబుతున్నాయి. ఈ సమయంలో తాజాగా టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే ఫలితాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే ఫలితాలు చెబుతున్నాయ్యి. ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు గానూ 21 నుంచి 22 సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇదే ఈ ఎన్నికల్లో మరోసారి కలిసి ప్రయాణిస్తున్న టీడీపీ – జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది.
అంటే… ఏపీలో వైసీపీ వన్స్ మోర్ అన్నమాట. ఈ లోక్ సభ స్థానాలను అసెంబ్లీ స్థ్హానాలకు అన్వయించుకుంటే… వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీకి 147 – 154 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా… టీడీపీ – జనసేన కూటమికి 21 – 28 స్థానాలు దక్కే అవకాశం ఉందన్నమాట!! అంటే… మరోసారి ఏపీలో వైసీపీకి గ్రాండ్ విక్టరీ కన్ ఫాం అని టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
కాగా… 2019 ఎన్నికల్లోనూ ఏపీలో వైసీపీ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 151 స్థానాల్లో విజయం సాధించింది. 25 లోక్ సభ స్థానాలకు గానూ 22 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక టీడీపీ 23, జనసేన ఒక్కస్థానంతోనూ సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.