గోదావరి భగ భగ… వైసీపీలోకి ముద్రగడ.. పోటీ అక్కడనుంచే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు.. ప్రధానంగా గోదావరి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.. మార్చి మొదటివారంలోనే రోహిణీ కార్తి ఎండలు వచ్చినంతగా రాజకీయ వాతావరణం భగభగ లాడుతుంది. ఎప్పుడు ఏ సమీకరణాలు ఎలా మారుతున్నాయో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న్నమొన్నటివరకూ జనసేనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది.

గోదావరి జిల్లా రాజకీయం ఉన్నపలంగా మరింత వేడెక్కింది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తీరుతో పూర్తిగా విసిగిపోయిన ముద్రగడ.. ఇటీవల ఒక లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో ఆవేదన, గోదావరి జిల్లా వెటకారం కలగలిపి… పవన్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ లేఖలో పవన్ విధానాలపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ముద్రగడ కుటుంబం వైసీపీలో చేరడానికి, పిఠాపురం నుంచి పోటీచేయడానికీ లైన్ క్లియర్ అయ్యిందని తెలుస్తుంది.

ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం కుటుంబం వైసీపీలో చేరడం పూర్తయిన తర్వాత.. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమారుడు బరిలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న వంగ గీతను సీఎం క్యాంప్ ఆఫీసుకుని పిలిపించి మాట్లాడారని.. పరిస్థితిని అర్ధమయ్యేలా చెప్పారని.. అందుకు ఆమె అంగీకరించారని తెలుస్తుంది.

ఇలా ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి అనువైన పరిస్థితులు చక చకా సెట్ అయిపోయాయని.. ఇక అధికారికంగా కండువా కప్పుకోవడమే తరువాయి అని అంటున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం అతి త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈమేరకు ముద్రగడ తన అనుచరులతోనూ, సామాజికవర్గ నేతలతోనూ చర్చలు జరిపి పాజిటివ్ సంకేతాలు అందుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వాస్తవానికి నిన్నమొన్నటివరకూ ముద్రగడ జనసేనలోనే చేరాలనుకున్నారని వార్తలొచ్చాయి. పైగా ఆయనను కలవడానికి పవన్ కల్యానే నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని కథనాలొచ్చాయి. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా జరిగిన సీట్ల పంపకంపై చాలా మంది కాపునేతలు, కాపు సామాజికవర్గ ప్రజానికంతో పాటు ముద్రగడ కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అసంతృప్తిని ఒక లేఖ రూపంలో బయటపెట్టారు.

అయితే ఆయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించే విషయంలో చంద్రబాబు అడ్డుతగులుతున్నారని.. చంద్రబాబు మాట జవదాటే పరిస్థితిలో పవన్ లేరని.. ఈస్థాయి బానిసత్వంలో నిండిపోయిన వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం సబబు కాదని, సరైన నిర్ణయం కాదని ముద్రగడ భావించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరబోతున్నారని.. అందుకు లైన్ క్లియర్ అయ్యిందని తెలుస్తుంది.

కాగా… భీమవరంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే నిజమైతే… ఇప్పుడు పోటీ పవన్ కల్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం కుమారుడు అన్నట్లుగా మారబోతుందనే భావించాలి. దీంతో… పవన్ పిఠాపురం నుంచి పోటీ కూడా ఉండదనే కామెంట్లు స్థానికంగా వినిపిస్తున్నాయి!!