Amaravati Agitation : అమరావతి ఉద్యమం.. తర్వాతేంటి.?

Amaravati Agitation : అమరావతి ఉద్యమానికి సంబంధించి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. బహిరంగ సభతో ఈ యాత్రకు ముగింపు పలికింది అమరావతి పరిరక్షణ సమితి. బహిరంగ సభ వేదికగా వైసీపీ, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీలూ అమరావతి విషయంలో ఏకతాటిపైకి వచ్చాయి.

అధికార వైసీపీ ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి వున్నామంటోందిగానీ, ఒక్క రాజధాని విషయంలోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతోంది. సరే, ప్రభుత్వానికంటూ కొన్ని అంచనాలు, ఆలోచనలు వుంటాయనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, అమరావతి రైతుల ఉద్యమంలో తదుపరి అధ్యాయమేంటి.?

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో ఉత్తరాంధ్ర వైపుగా అమరావతి రైతుల పాదయాత్ర వుండబోతోందని తెలుస్తోంది. ఈ దిశగా అమరావతి పరిరక్షణ సమితి సమాలోచనలు చేస్తోందట. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు కూడా అమరావతి పరిరక్షణ సమితిలో జరుగుతున్నాయని సమాచారం.

ఏం చేసినా, వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. అదే సమయంలో, అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమం కూడా చల్లారేలా కనిపించడంలేదు. 29 గ్రామాల ప్రజలు వర్సెస్ 13 జిల్లాల ప్రజలు.. అనే స్థాయిలో అధికార వైసీపీ.. ఈ మొత్తం వ్యవహారాన్ని మార్చేస్తోంది.

వైసీపీ ఆలోచనలెలా వున్నా, అమరావతి పరిరక్షణ సమితి వ్యూహాలెలా వున్నా.. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితే, ప్రజా తీర్పు అనేది ఎన్నికలతోనే తేటతెల్లమవుతుంది. అందుకు రెండున్నరేళ్ళ సమయముంది. ఈలోగా ఎవరి గోల వారిదే.