పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు దక్కించుకున్న ఏపీ బీజేపీలో ఇప్పుడు సరికొత్త రచ్చ తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్లు, అసలు సిసలు బీజేపీ నేతలకు కాకుండా… వలసపక్షులకు, చంద్రబాబు పంపిన కోవర్టులకు, ఆయన రిఫర్ చేస్తున్నవారికీ టిక్కెట్లు ఇస్తున్నారనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. బీజేపీ అంటే కాషాయ దళమని… అంతేకానీ పసుపు వర్గానికి బీ టీం కాదనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై బీజేపీ సీనియర్లు ఫైరవుతున్నారు.
ఏపీ బీజేపీలో ఉన్న 16 స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక పార్టీలో చీలిక తీసుకొస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా… అసలు సిసలు బీజేపీ నేతలు వర్సెస్ వలస పక్షులు అనే టాపిక్ ఇప్పుడు ఆ పార్టీలో ట్రెండింగ్ లో ఉందని అంటున్నారు. అయితే దీనికి కారణం ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు అనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం. కారణం… ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఉన్న సీట్లలో ఎవరిని ఎక్కడ పోటీకి నిలబెట్టాలనే విషయంలో ఆయన పాత్ర కీలకంగా మారడమే అని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… ఏపీలో బీజేపీకి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో… క్యాండిడేట్ల ఎంపికలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వ్యవహారశైలి ఏమాత్రం సరిగా లేదంటూ బీజేపీ సీనియర్ నేతలు ఫైరవుతున్నారు! ఇదే సమయంలో… అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సీరియస్ గా జరుగుతున్న వేళ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా ఎంటరైపోయారని పలువురు బీజేపీ సీనియర్లు నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే… బీజేపీ అభ్యర్థుల ఎంపికతో ఆయనకు ఏమిటి సంబంధం అని నిలదీస్తున్నారని సమాచారం.
ఏపీ బీజేపీలో అర్హులైన సీనియర్ నేతలు కావాల్సినంత మంది ఉన్నప్పటికీ… పక్కపార్టీల నుంచి వచ్చిన వారికీ.. సూట్ కేసులు తెస్తున్నవారికీ టిక్కెట్లు కేటాయిస్తున్నారంటూ ఒక వర్గం నేతలు ఫైరవుతున్నారంట. ఈ విషయాన్ని నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు! ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న దారుణాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనునట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో… విజయవాడ బరిలో పీవీపీ, తిరుపతి ఆదికేశవుల కూతురుకు సీటు కేటాయించేందుకు భారీగానే డబ్బులు చేతులు మారి ఉంటాయని.. ఈ విషయంలో వెంకటేశ్వర రావు కీలక భూమిక పోషిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
ఏది ఏమైనా… ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ టీడీపీ క్షేమం కోరుతూనే పురందేశ్వరి పనిచేస్తున్నారని.. బీజేపీ అంటే ఏపీలో టీడీపీకి బీటీం అన్నట్లుగా మార్చే పనిలో బిజీగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు కాషాయ దళసభ్యులు! మరి ఈ విషయంపై ఇప్పటికే హస్తినలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు అందాయని తెలుస్తున్న నేపథ్యంలో.. అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తాదనేది వేచి చూడాలి.