‘స్కంద’ చిత్రం కన్నుల విందుగా వుంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్కోర్ చేసిన మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వున్నాయి. స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నిర్వహించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

స్కంద ప్రీరిలీజ్ థండర్ ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఉస్తాద్ రామ్ పవర్ హౌస్ ప్రెజెన్స్ , హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఒక విస్పోటంలా వుంది. రామ్ వండర్ ఫుల్ మాస్ ట్రాన్స్ ఫర్మేషన్, ఫెరోషియస్ యాటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలలో డైనమిజం ఎక్స్ టార్దినరిగా వున్నాయి.
‘’దెబ్బ తాకితే సౌండ్‌ గోల్కొండ దాటాల..శాల్తి శాలిబండ చేరాలా’
‘మీకు నిదరపోయే వాళ్ళని చంపడం అలవాటేమో.. నాకు నిద్రలేపి చంపడం అలవాటు’’
‘’పులి వేటకొచ్చింది’’ అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు డైనమైట్స్ లా పేలాయి.

కథ, యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాళ్లలో తీర్చిదిద్దడంలో బోయపాటి మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఒకవైపు మాస్ తో విశ్వరూపం చూపిస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్టిపడేశారు. తమన్ నేపధ్య సంగీతం మాస్ ని మరింతగా ఎలివెంట్ చేసింది. సంతోష్ డిటాకే కెమరా పనితనం అద్భుతంగా వుంది. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. మాస్ విస్పోటనంతో పాటు అద్భుతమైన కుటుంబ భావోద్వేగాలతో అలరించిన స్కంద ట్రైలర్ తో బోయపాటి, రామ్ కాంబో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రీరిలీజ్ థండర్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘స్కంద’ అనే టైటిల్ కి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా భక్తి పారవశ్యాన్ని తెలియజేసుకుంటున్నాను. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా వుంది. బోయపాటితో సింహా, లెజెండ్ ,అఖండ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశాం. దీని తర్వాత ఏమిటి ? అన్నపుడు ఒక వీరసింహారెడ్డి చేశాను. అది కూడా ఘన విజయం సాధించింది. కొత్తదనాన్ని, నేపధ్యాన్ని ఆదరిస్తున్న అభిరుచి తెలుగు ప్రేక్షకులదే. విదేశాల్లో కూడా మన సినిమాకి బ్రహ్మ రధం పడుతున్నారంటే దానికి తార్కాణం ఇదే. అది మా నాన్న గారితో మొదలైయింది. ఆయన ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలనే తపనతో, స్వలాభం కోసమే కాకుండా పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇస్మార్ట్ శంకర్ తో తమ్ముడు రామ్ నాకో సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను తెలంగాణ యాసలో భగవంత్ కేసరి చేశాను. ఆయన్ని నేను ఫాలో అవుతుంటే ఇపుడు నన్ను మళ్ళీ తను ఫాలోయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తున్నాడు. స్కంద సినిమా తప్పకుండా బాగా ఆడాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. బోయపాటి గారు చాలా అంకితభావంతో పని చేస్తారు.

ఒకొక్క సినిమా మాకు ఒక సవాల్ . ఒక సినిమా జరుగుతున్నపుడు మరో సినిమా గురించి అలోచించం. సినిమాకి సినిమాకి వైవిధ్యం చూపించడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అఖండ చెప్పింది. బాక్సులు రికార్డులు బద్దలైపోయాయి. దేవదాస్ నుంచి రామ్ ప్రయాణం చూస్తున్నాం. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఎంతో తపన వున్న నటుడు. మనం అందరం గర్వించదగ్గ నటుడు, కళామతల్లి మనకి ఇచ్చిన ఒక వరం రామ్ పోతినేని. తను మరిన్ని చిత్రాలు చేసి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీలీల పదహారణాల తెలుగమ్మాయి. అందం, అభినయం, నృతం అన్ని కలగలిపిన ప్రతిభ ఆమె సొంతం. భగవంత్ కేసరిలో తను నటిస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా తనలో ఎలాంటి అలసట కనిపించదు. తనకి మరింత పేరుప్రఖ్యాతలు రావాలి. సాయి మంజ్రేకర్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషించారు. నటీనటులనుంచి చక్కని నటన రాబట్టుకోవడంలో బోయపాటి గారు దిట్ట. నిర్మాత శ్రీనివాస చిట్టూరి గారు గ్రాండ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీకాంత్, ఇంద్రజ, మహేష్ గారు ఇలా ఎంతో మంది మంచి నటులు వున్నారు. స్టంట్ మాస్టర్ శివ గారు అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు.. కెమరామెన్ సంతోష్ అద్భుతంగా విజువల్స్ ని చిత్రీకరించారు. సినిమాకి పని చేసిన అందరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ట్రైలర్ లో చూసినట్లే సినిమా కూడా కన్నుల విందుగా,చెవులకు ఇంపుగా వుంటుందనే నమ్మకం వుంది. అభిమానులు, పరిశ్రమ ఒక కుటుంబం. మంచి సినిమాలని ఆదరిస్తూ వాటిని విజయవంతం చేస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. స్కంద ప్రీరిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన బాలకృష్ణ గారికి థాంక్స్. ఆయన రాకతోనే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా మెమరబుల్ గా జరిగింది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. త్వరలో ఒక పాట వస్తుంది అది మాములుగా వుండదు. అది వింటే ఈ సినిమా మీటర్ ఏమిటో బాగా అర్ధమౌతుంది. నిర్మాత శ్రీనివాస్ గారు లేకపోతే ఈ సినిమా వుండదు. ఐదేళ్ళ క్రితమే బోయపాటి, మీరు కాంబినేషన్ అయితే అడిపోతుందని చెప్పారు. అది ఈవాళ కుదిరింది. పవన్ గారికి థాంక్స్. సాయిమంజ్రేకర్ చక్కగా నటించారు. సినిమాకి డేట్స్ ఇస్తే హీరోయిన్ అంటారు. ఒక్క డేట్ సినిమాకి ఇస్తే అది శ్రీలీల అంటారు ( నవ్వుతూ) .తనకి గ్రేట్ ఫ్యూచర్ వుంది. బోయపాటి గారు మొండిగా నమ్మి వెళ్ళిపోతారు. ట్రైలర్ లో చూసిన లుక్ కి ఏడు గంటలు పట్టేది. పక్కనే కూర్చుని ఓపికగా చేయించారు. బాలయ్య గురించి ఒక మాట చెప్పాలి. మాస్ , క్లాస్ , ఫ్యామిలీ, అమ్మాయిలు .. ఇలా అన్నీ సెక్షన్స్ జై బాలయ్య మంత్రం జపిస్తుంది. బాలయ్య గారి గురించి జైలర్ సినిమాలో పాట పాడుతా. నీ రచ్చ చుసినోడు, నీ అయ్యా విజల్ విన్నవాడు, రేపు నీ కొడుకు మనవడితో డ్యాన్స్ చేయించేవాడు… మూడు జనరేషన్స్ జై బాలయ్య అంటుందంటే.. ఒక నటుడికి అది పెద్ద అచీవ్ మెంట్. ఇంతకంటే మించిన అవార్డ్ వుండదు. నా ఫ్యాన్స్ కి ఒక మాట చెప్పాలి. పులి వేటకి వచ్చింది. షూట్ చేసినప్పుడు అందరికి కెమరా కనిపిస్తుందోమో. నాకు మాత్రం మీరే కనిపిస్తారు. అందుకే వొళ్ళు దగ్గరపెట్టుకొని పని చేస్తా. నా లక్కు మీరే నా కిక్కు మీరే. అందరికీ థాంక్స్. జై బాలయ్య’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ముందుగా బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పాలి. మనం అందరం జై బాలయ్య అంటాం. అది మన గుండెలోపల నుంచి వచ్చే మాట. ఇలా రావడానికి ఒక కారణం వుంది. బాలకృష్ణ గారితో పదిహేనేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఆయన వ్యక్తికాదు.. శక్తి. ఒక పాత్ర ఇస్తే దాన్ని లొంగదీసుకొని ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేసే శక్తి. బాలయ్య గారు ఆశీర్వాదంలో మన హితమే కాదు జనహితం వుంటుంది. అందుకే.. జై బాలయ్య. ఈ వేడుకు వచ్చిన మమ్మల్ని దీవించిన బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మా అఖండ 2 వుంటుంది. దాని గురించి త్వరలో చెప్తాను. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్ళు ఎంతలా ఆదరిస్తారో చూశాను. ఈవాళ ‘స్కంద’ అనే ఓ మంచి సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను. ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను. గుండె మీద చేయి వేసుకొని సినిమా చూడండి. ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. యాక్షన్ ఎమోషన్ హై లెవల్స్ ఉండనే వుంటాయి. పరిపూర్ణమైన సినిమా స్కంద. ఒక పాత్ర ఇస్తే దాన్ని ఎలా చేయాలనే నిరంతర తపన పడే వ్యక్తి రామ్. తను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అతని తపన. ఈ సినిమాలో ఎలా చేశారో ట్రైలర్ లో చూశారు. రేపు సినిమాలో చూడబోతున్నారు. శ్రీలీల డ్యాన్స్ బాగా చేస్తుందని అందరూ చెబుతున్నారు. తనలో డ్యాన్స్ గ్లామర్ తో పాటు అద్భుతమైన ఆర్టిస్ట్ వుంది. సాయి మంజ్రేకర్ పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. శ్రీకాంత్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. సంతోష్ డిటాకే అద్భుతమైన కెమరా వర్క్ చేశారు. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సైరనోడు, అఖండతో ఎలాంటి వర్క్ చేశామో చూపించాం. తను ఎంత అద్భుతం చేస్తారో స్కంద తో కూడా చూస్తారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, స్టంట్ శివ గారు మా టెక్ని షియన్స్ అద్భుతంగా చేశారు. నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆస్కార్ , నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇందులో మూడు పాటలు చేశారు. అల్లు అర్జున్ గారితో పాటు జాతీయ అవార్డు విజేతలందరికీ ఈ సందర్భంగా అభినందనలు. సినిమా గెలిచింది. తెలుగు పరిశ్రమ గెలిచింది. అది కావాలి. ఒకటిని విడుదలై ఖుషి సినిమా బావుండాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే పొలిశెట్టి బావుండాలి, ఆతర్వాత రిలీజ్ అయ్యే మన స్కంద సినిమా బావుండాలి, తర్వాత వచ్చే ప్రభాస్, బాలకృష్ణ గారి సినిమా, రవితేజ గారి సినిమా ఇలా అన్నీ గెలవాలి. మా నిర్మాత శ్రీనివాస్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఈ సినిమా ఆయన తప్పితే మరొకరు చేయలేరు, మా జర్నీ ఇలానే కొనసాగాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.

శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారికి నమస్సుమాంజలి. బాలకృష్ణ గారు ఈ వేడుకు రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు.

శ్రీలీల మాట్లాడుతూ.. ఈ వేడుకు అతిధిగా వచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ధమాకా రిలీజ్ కి ముందు సైన్ చేసిన చిత్రమిది. బోయపాటి గారికి థాంక్స్. బాలయ్య గారి గురించి చాలా చెప్పాలని వుంది. మరో నెలలో ఇలాంటి ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అప్పుడు చెబుతాను.(నవ్వుతూ).తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. రామ్ గారితో పని చేయడం చాలా అనందంగా వుంది. గండర బాయ్ పాట షూటింగ్ చేసినప్పుడు డ్యాన్స్ లో మా ఎనర్జీ ఎక్స్ చేంజ్ చేసుకునేలా అనిపించింది. అది గ్రేట్ మూమెంట్. చాలా మంది నటీనటులతో కలసి పని చేసే అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 15న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.

తమన్ మాట్లాడుతూ.. బోయపాటి గారి థాంక్స్. సరైనోడు, అఖండ .. ఇప్పుడు స్కంద. సెప్టెంబర్ 15న తప్పకుండా హ్యాట్రిక్ కొడుతున్నాం. . సెప్టెంబర్ 15 స్కంద. థియేటర్స్ లో స్పీకర్స్ జాగ్రత్త’’ అన్నారు.

సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి థాంక్స్. సెట్స్ లో చాలా సరదాగా గడిచింది. రామ్, శ్రీలీల గారితో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ థాంక్స్’’ తెలిపారు

శ్రీకాంత్ మాట్లాడుతూ.. బోయపాటి గారు సరైనోడు లో నాకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ గారి అఖండ నా లైఫ్ ని టర్న్ చేసింది. ఆ సినిమా తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాలలో మంచి మంచి పాత్రలు వచ్చాయి. స్కందలో కూడా చాలా మంచి సెంటిమెంట్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. బోయపాటి గారి దర్శకత్వంలో ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎగిరే పావురమా సినిమా చేస్తున్నప్పుడు రామ్ ని చిన్నపిల్లాడిగా చూశాను. గొప్ప డ్యాన్స్ ఫైట్స్ చేసే హీరోల్లో రామ్ ఒకరు పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. శరామ్ అండ్ శ్రీలీల డ్యాన్స్ కోసం చాలా మంది ఎదురుచుస్తున్నారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.

ప్రిన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అలాగే రామ్ గారితో చాలా రోజుల తర్వాత కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. బోయపాటి గారి దర్శకత్వంలో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది’’ అన్నారు. ఈ వేడుకలో ఇంద్రజ, స్టన్ శివ, సంతోష్ డికాటే, కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.