Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. అఖండ తాండవం విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలగలిపిన సినిమా ఆపాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం.
ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే. నా వృత్తి నా దైవం. ఆ వృత్తే అఖండ సినిమాలో నా పాత్ర. పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మాతండ్రి గారికి పాదాభివందనాలు. ఇది యావత్ ప్రపంచ ప్రేక్షకులకు సంబంధించిన సినిమా. ఈ సినిమా కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమానే కాదు.. ఒక బైబిలు ఒక ఖురాన్ కి కూడా సంబంధించిన సినిమా. మన వేదం నుంచే విజ్ఞానం పుట్టింది.
Akhanda 2 Thaandavam Movie Review: ‘అఖండ : తాండవం’ మూవీ రివ్యూ!
మన దేశం యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడే యువతరానికి అర్థమవుతుంది. అఖండ సినిమా కూడా ఒక పరీక్ష లాంటిదే. సరిగ్గా కోవిడ్ సమయంలో రిలీజ్ అయింది. థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారా లేదా అన్న ఒక మీమాంస ఉండేది. అలాంటి సమయంలో భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా నిర్మాతలు అందరికీ ధైర్యం వచ్చి సినిమాలను రిలీజ్ చేయడం చేశారు. ఆ తర్వాత చేసిన వీర సింహారెడ్డి నేలకొండ భగవత్ కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ తాండవం అన్నీ కూడా అద్భుతమైన విజయాలు. అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. అఖండలో దేవుడు మనిషిలో పూనాడు. ఇందులో మనిషే దేవుడైతే ఏమవుతుంది.. సంభవామి యుగే యుగే అన్నదే చూపించాం. సకుటుంబం సపరివార సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. పిల్లలకు కూడా ఈ సినిమాని చూపించి, మన మూలాల గురించి తెలియజేయాలని కోరుతున్నాను. సనాతన ధర్మ పరాక్రమ ఏమిటో చూపించిన సినిమా అఖండ తాండవం. సత్యం మాట్లాడాలి ధర్మం దారిలో నడవాలి అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలి అని చాటి చెప్పిన సినిమా అఖండ తాండవం.
ఎంతోమంది కష్టపడితేనే ఒక సినిమా అవుతుంది. తమన్ నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపారు. అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు దాని యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత ఉందనేది ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు అందించడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక అనీర్వచనీయమైన అనుభూతిని కలిగించింది. ఈ సినిమా కోసం కష్టపడినా అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దిల్ రాజు గారికి మ్యాంగో రామ్ గారికి శ్రీధర్ గారికి డాక్టర్ సురేందర్ గారికి.. ఈ సినిమా విడుదల కావడానికి వాళ్ళు పడ్డ శ్రమకు ధన్యవాదాలు. ఇదంతా దేవుడు పెట్టిన పరీక్షగానే భావిస్తాను. ప్రేక్షకులు ఇచ్చిన విజయం ముందు ఇదంతా ఆఫ్ట్రాల్. ఈ సినిమాలో అన్ని కూడా అద్భుతమైన సన్నివేశాలు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసర్ల శ్యామ్ గారు, మా డాన్స్ మాస్టర్లు, గాయకులు అందరికీ అభినందనలు. ఇంత అఖండమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు. ఈ విజయాన్ని మీకు మీరు ఇచ్చుకున్నందుకు.. మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, సోదర సమానులైన నందమూరి అభిమానులకు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్లిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది ఏ స్థాయిలో ఉందనేది పెద్దలు గౌరవనీయులందరూ కూడా మాట్లాడారు. ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఏం మ్యాజిక్ చేశారనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు. భారతదేశం ధర్మ గ్రంథాలయం. భారతదేశ ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి.
నమ్మని దేశాలు ఇంకోలా ఉన్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు ఓడిపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమానే ఇది. ఈ సినిమా దేవుని సంకల్పం. దానికి మీరు అద్భుతంగా ఆదరించారు. మా ధర్మం ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం. అలా ముందుకు తీసుకొచ్చాం. అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఈ సినిమాని ఇంత అద్భుతంగా చేయగలిగామంటే కారణం బాలయ్య బాబు గారి సపోర్టు. ఆయన సపోర్ట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా చేయలేం. ఈ సినిమాని ప్రేక్షకులు మరింతగా ఆదరించి గొప్ప స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాని వాళ్ళ పిల్లలకు చూపిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాని త్రీడీలో కూడా రిలీజ్ చేశాం. త్రీడీ లో ఉన్న షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. త్రీడీలో మీరు ఈ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అభిమానులు అందరు కూడా త్రీడీలో చూడాలని కోరుకుంటున్నాను. ఒక కొత్త లోకం చూస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి సినిమా బాగా ఆడాలని మా కోరిక. తెలుగు పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. మనందరం బాగుంటేనే ఈ దేశంలో మనం నిలబడగలం. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.
నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 11నరాత్రి ప్రీమియర్స్ మొదలైనప్పుడు నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. నేను సుదర్శన్ కి వెళ్లాను. శిరీష్ గారిని కూకట్పల్లి థియేటర్ పంపించాను. మిగతా వారిని వేరే థియేటర్స్ కి పంపించాను. అన్ని చోట్ల రియాక్షన్స్ అదిరిపోయింది. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. ఒక గొప్ప మ్యాజిక్ జరిగింది. ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఎపిసోడ్లో బాలకృష్ణ గారిని బోయపాటి గారి అద్భుతంగా చూపించారు. ఫ్రైడే సెకండ్ షోస్ నుంచి ఎక్కడ చూసినా థియేటర్స్ ఉదృతంగా మారాయి.
మహిళలు పిల్లలు ఈ సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజే 70 పెర్సెంట్ రికవర్ చేశాం. ఈమధ్య బాలకృష్ణ గారి దాదాపు సినిమాలన్నీ మేమే రిలీజ్ చేస్తున్నాం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారికి బోయపాటి గారికి టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకి లాజిక్కులు అక్కర్లేదు. ఓన్లీ దైవత్వం. నెక్స్ట్ జనరేషన్ కి ఈ సినిమా ఒక గీత. ప్రతి ఒక్కరిని దైవత్వంతో కనెక్ట్ చేసినందుకు బాలకృష్ణ గారికి బోయపాటి గారికి థాంక్యూ వెరీ హ్యాపీ.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చేస్తే ఒక ధైర్యం వస్తుంది. చాలా ప్యూరిటీ వస్తుంది. అఖండ గ్రేడ్ జర్నీ. బాలయ్య గారి ప్రతి సినిమా ఒక పరీక్ష. ఎలా కొత్తగా చేయాలని తపన ఉంటుంది. లిరిక్ రైటర్స్ అద్భుతమైన సాహిత్యం రాశారు. అఖండ లాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం ఒక ఛాలెంజ్. మా సింగర్స్ అందరు కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సంతోష్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మైనస్ డిగ్రీల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. శివుని ఆజ్ఞతో ఇదంతా జరిగిందని భావిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్పది మనందరం ఐక్యమత్యంతో ఉంటే ఇంకా బలంగా ముందుకు వెళ్తాం. ప్రతి సినిమా మన సినిమాలనే భావించాలని కోరుతున్నాను. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సులు బద్దలవుతాయని నమ్మకంతో మేమున్నాం. అదే రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. బాలయ్య గారితో ఐదు సినిమాలు ఐదు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాము. చాలా ఆనందంగా ఉంది. గోపీచంద్ తో మరో సినిమా స్టార్ట్ చేశాం. అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది.
గంగాధర శాస్త్రి మాట్లాడుతూ . ఇన్ని సంవత్సరాల చిత్ర పరిశ్రమలో ఒక సినిమా చూసి తరించామనే గొప్ప అనుభూతితో ప్రేక్షకుడు బయటికి వచ్చిన అరుదైన సినిమా అఖండ 2. ఈ సినిమా ఆత్మ బాలకృష్ణ గారు, ఆలోచన బోయపాటి గారు, శబ్దం తమన్ గారు. ఈ ముగ్గురు కూడా తపస్సులు. భగవంతుడే వారిని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. బాలకృష్ణ గారు కాకపోతే ఈ సినిమా మరొకరికి సాధ్యపడదు. ఇలాంటి సినిమా చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. రామారావు గారి అంశ బాలకృష్ణ గారు రూపంలో ఉంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా. ఇలాంటి సినిమా బాలకృష్ణ గారు ఒక్కరు మాత్రమే చేయగలరు. ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో అద్భుతంగా ఆడి ప్రధాని మోడీ గారి దగ్గర కూడా చేరి యూనిట్ తో ఆయన ఫోటోలు దిగే పరిస్థితి రాబోతుందని విన్నాను. జై శ్రీ కృష్ణ.. సర్వేజనా సుఖినోభవంతు.
రచ్చ రవి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఒక బాధ్యతతో సినిమా తీసే కథానాయకుడు. ఈ సినిమాని కూడా భావితరాల కోసం ఎంతో గొప్ప ఉద్దేశంతో చేశారు. మన కోసం అందించిన చిత్రాన్ని మనం చూడాలి. విజయవంతం చేయాలి. ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన స్పందన వస్తోంది. భగవంతుడు సృష్టించిన క్యారెక్టర్ అని మాకు అర్థమవుతుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో మేము కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. బాలయ్య బాబు గారు ఈ సినిమాకి ఒక దైవ శక్తితో పనిచేశారు. ఇది శివ అనుగ్రహం వల్లే జరిగింది. థియేటర్స్ లో ఆడియన్స్ పూనకాలు వస్తున్నాయంటే దానికి కారణం బాలయ్య బాబు గారు పడిన కష్టం. చాలా రోజుల తర్వాత ఒక థియేటర్ ని టెంపుల్ గా మార్చిన సినిమా అఖండ. ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. అఖండ సినిమాకి ఎంత అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా చరిత్రకి తలమానికంగా నిలుస్తుంది. ఈ శివతాండవాన్ని అద్భుతంగా ఆదరించినందుకు ధన్యవాదాలు. బాలయ్య గారు పంచభూతాల ఆవాహనతో అఖండ తాండవం చేశారు. ఈ విజయంలో నేను కూడా భాగస్వామ్యం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన మా గురువుగారు బోయపాటి గారికి ధన్యవాదాలు. తమన్ గారు ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ నా భూతో నా భవిష్యతి. తమన్ గారు అఖండ కోసమే పుట్టారని నా బలమైన భావన. యువతరానికి ఈ సినిమా చేరువయ్యింది. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.





