హ్యాకింగ్ ముప్పు: మోడీ సర్కార్ కొరడా ఝుళిపించదేల.?

భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా, రాజకీయ సలహాదారుగా పేరొందిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, ఐదుసార్లు మొబైల్ హ్యాండ్ సెట్ మార్చినాగానీ.. ఆయన హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోలేకపోయారు. దేశంలో చాలామంది ప్రముఖుల మొబైల్ ఫోన్లు హ్యాకింగ్‌కి గురయ్యాయట. ఈ అంశాన్ని భారత నిఘా సంస్థలు ఎందుకు గుర్తించలేకపోయాయి.? ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూసిన ఓ నివేదిక ద్వారా ఈ వ్యవహారాలు బట్టబయలయ్యాంటే అప్పటిదాకా మన వ్యవస్థలు ఏం చేస్తున్నట్లు.? ప్రభుత్వంలో వున్నవారి ఫోన్లూ హ్యాక్ అయ్యాయి.. జర్నలిస్టుల ఫోన్లూ హ్యాక్ అయ్యాయి.. విపక్షాలకు చెందిన నేతల ఫోన్లూ హ్యాక్ అయ్యాయి. అంతేనా.? భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారుల ఫోన్లు హ్యాక్ అయి వుండవని ఎలా అనుకోగలం.?

ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఇవి కాదు అసలు సమస్య. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పౌరులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం కాదు అసలు సమస్య. దేశం మీదకు హ్యాకింగ్ దండెత్తింది.. ఇదీ అసలు సిసలు సమస్య. ఇది పెను ప్రమాదం.. అంతకంటే ఎక్కువ. ఎలా ఈ వ్యవహారాన్ని అభివర్ణించాలో 140 కోట్ల మంది భారతీయులకు అర్థం కావడంలేదు. తయారు చేసిందెవరో తెలుసు.. కానీ, వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వ పెద్దలెవరూ పెదవి విప్పడంలేదిప్పుడు. కారణం, ఆ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసింది.. ఆయా సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలకు ఉపయోగపడేందుకేనట. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది వ్యవహారం. ఏమో, ప్రతి ఒక్కరి ఫోన్లలోనూ హ్యాకింగ్ జరిగి వుండొచ్చేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. అలా జరిగి వుంటుందా.? జరిగి వుంటే మాత్రం.. భారతీయుల సంపద.. భారతీయుల భద్రత.. భారతీయుల వ్యక్తి సమాచారం.. అంతా దోపిడీకి గురయ్యే వుండాలి. కేంద్రం నోరు మెదపాల్సిందే.. విపక్షాల మీద విమర్శలు చేసేస్తే సరిపోదు. చట్ట సభల్ని పక్కదారి పట్టిస్తే సరిపోదు.