ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు నిజంగా అద్భుత అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులే చేయగలిగింది. అయితే ఈ తక్కువ స్కోరును కాపాడుతూ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రక్షించుకున్న అత్యల్ప టోటల్ కావడం విశేషం.
మ్యాచ్ ప్రారంభంలో పంజాబ్ బ్యాటింగ్ చేసేందుకు దిగింది. కానీ వారి ఇన్నింగ్స్ కేవలం 15.3 ఓవర్లలో 111 పరుగులకే ముగిసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లు హర్షిత్ రాణా, నరైన్, వరుణ్ చక్రవర్తి చక్కగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దీంతో పంజాబ్ భారీ స్కోరు చేయలేకపోయింది.
కోల్‌కతా ఈ లక్ష్యాన్ని సులభంగా చేధించేస్తుందని అందరూ భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు ఒక్కసారిగా మ్యాజిక్ చేశారు. చాహల్ 4 వికెట్లు తీసాడు. మార్కో జాన్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్, మ్యాక్స్‌వెల్ కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఈ బౌలింగ్ అటాక్ ముందు కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇన్నింగ్స్ మధ్య విరామంలో చాలా మంది కోల్‌కతా ఎప్పుడు గెలుస్తుందా అని ఎదురుచూశారు. కానీ పంజాబ్ ఆటగాళ్లు మళ్లీ మళ్లీ వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను తమవైపు తిప్పేశారు. చివర్లో రస్సెల్ ఒక్క ఓవర్‌లో 16 పరుగులు కొట్టినా, వెంటనే అతడిని అవుట్ చేస్తూ పంజాబ్ విజయం దిశగా ముందుకెళ్లింది. టీ20లో తక్కువ స్కోరు చేసినా కచ్చితమైన బౌలింగ్, ఫీల్డింగ్ ఉంటే విజయం సాధించవచ్చు అని ఈ మ్యాచ్ రిజల్ట్ ఒక ఉదాహరణ. పంజాబ్ కింగ్స్ ఈ గెలుపుతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది వాళ్లకు మంచి మోమెంటం ఇవ్వొచ్చు.


