Good Bad Ugly: అజిత్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’పై ఇళయరాజా నోటీసు.. ఏం జరిగింది?

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఊహించని వివాదంలో ఇరుక్కుంది. మ్యూజిక్ దిగ్గజం ఇళయరాజా ఈ సినిమాకు లీగల్ నోటీసులు జారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అనుమతి లేకుండా తన స్వరపరిచిన మూడు పాటలను ఈ సినిమాలో ఉపయోగించారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా విడుదలైన ఈ చిత్రంలో గతంలో ఇళయరాజా స్వరపరిచిన మూడు ప్రఖ్యాత గీతాలను కొత్తగా రీక్రియేట్ చేసి వాడినట్లు సమాచారం. అయితే ఈ పాటల హక్కుల కోసం తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అనుమతి కూడా తీసుకోలేదని ఇళయరాజా లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ కారణంగా సినిమా నిర్మాణ సంస్థ రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

ఇంతటితో కాదు, ఈ మూడు పాటలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన కోరారు. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇళయరాజా చాలా కట్టుబాట్లు పాటించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన పాటలను అనుమతి లేకుండా వాడితే వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం కొత్త విషయం కాదు.

ఇక ఈ వివాదానికి కేంద్రంగా నిలిచిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అజిత్ యాక్షన్ కామెడీ మూడింటిని కలిపిన పాత్రలో కనిపించగా, సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రదర్శనపై మిశ్రమ స్పందన వచ్చినా, ఈ లీగల్ నోటీసుతో ఇంకొంచెం నెగటివ్ హైప్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఇళయరాజా నోటీసుపై స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త ట్విస్ట్ || Pastor Praveen Pagadala Case Final Report || Telugu Rajyam