వారణాసి లో ‘రియల్ చౌకీదార్’ నామినేషన్ తిరస్కరణ

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకుని సంచలనం సృష్టిస్తున్న మాజీ బిఎస్ ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

తేజ్ బహదూర్ యాదవ్ మొదట ఇండిపెండెంటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తర్వాత ఆయనను సమాజ్ వాది పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. సొంత అభ్యర్థి శాలిని అనే మహిళలను ఉపసంహరించి, యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించి మోదీని ఇరుకున పెట్టాలనుకుంది సమాజ్ వాది పార్టీ. ఎందుకంటే, చీటికి మాటికి సైన్యం, పుల్వామా, బాలకోట్ , సైన్యం త్యాగాలు మట్లాడి దేశభక్తిని ఓట్లుగా మార్చుకునేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నందున ఆయన మీద నిజమైన సైనికుడిని నిలబెడితే, సైన్యంలో ఎంజరుగుతున్నదో, ప్రధాని ఏమి చేస్తున్నాడో యాదవ్ వివరిస్తారని సమాజ్ వాదిపార్టీ భావించింది. అపుడు ప్రధాని సైన్యం ప్రస్తావన మానేస్తారని ఆ పార్టీ నమ్మకం.

అయితే, సరైన డాక్యుమెంట్లు సమర్పించలేదని ఎన్నికల అధికారులు తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.

సమాజ్ వాది పార్టీ ఏప్రిల్ 29న అఫిషియల్అభ్యర్థిని మార్చింది. యాదవ్ హర్యానా రేవారికి చెందిన వ్యక్తి.. 2017లో ఆయనను బిఎస్ ఎఫ్ నుంచి తొలగించారు. బిఎస్ఎఫ్ లో జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదని ఇక్కడ పూర్తిగా అవినీతి తాండవిస్తున్నదని ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసి జవాన్లు ఎలా బతుకుతున్నావో వెల్లడించారు. దీనితో విచారణ జరిపి అవిధేయత అంటూ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఏప్రిల్ 30 వ తేదీన ఎన్నికల కమిషన్ ఆయనకు ఒక నోటీసు పంపుతూ ఇండిపెండెంటుగా వేసిన నామినేషన్ పత్రాలలో, సమాజ్ వాది తరఫున వేసిన పత్రాలలో తప్పులున్నాయని, దానిమీద మే ఒకటో తేదీకల్ల సమాధానమీయాలని ఆదేశించింది.

తనని సర్వీస్ నుంచి తొలిగించినట్లు ఇచ్చిన సమాచారం రెండు నామినేషన్ పత్రాలలో భిన్నంగా ఉందని కమిషన్ చెబుతూ ఉంది. దీనికి గడువులోగా వివరణ రాకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించామని అధికారులు ప్రకటించారు. నామినేషన్ పరిశీలన సమయంలో కనిపించని లోపాలు ఇపుడెలా కనిపిస్తున్నాయని, దీని వెెనక రాజకీయవత్తిడి వుందని యాదవ్ చెబుతున్నారు.

ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం-1951 సెక్షన్ 9 ప్రకారం ఎవరైనా ప్రభుత్వోద్యోగి సర్వీసునుంచి అవినీతికారణంగా లేదా అవిధేయత వల్ల డిస్మిస్ అయినపుడు అయిదేళ్ల దాకా ఆయన మీద ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుందని అధికారులు చట్టం చూపిస్తున్నారు.

ఈ అయిదేళ్ల గడువు తీరకముందే యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నందున ఆయన నామినేషన్ చెల్లదని ఎన్నికల అధికారి చెప్పారు. దానికి తోడు కమిషన్ అడిగిన అదనపు డాక్యుమెంట్లను యాదవ్ సకాలంలో అందివ్వలేదని కూడా అధికారులు చెబుతున్నారు.

తన నామినేషన్ పత్రాలను తిరస్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ తిరస్కరించడం తప్పు అని యాదవ్ అన్నారు. కొన్ని పత్రాలు కావాలని ఏప్రిల్ 30న అధికారులు అడిగారు. వాటిని సమర్పించినా తన నామినేషన్ ను తిరస్కరించారని ఆయన వాదిస్తున్నారు.

డాక్యుమెంట్లను సకాలంలో అందివ్వక పోవడం కాదు, రాజకీయ వత్తిడి వల్లనే తన నామినేషన్ నుతిరస్కరించారని యాదవ్ ఆరోపిస్తున్నారు. తను నామినేషన్ వేయడంతో ప్రధాని మీద నిజమయిన చౌకీదార్ తో పోటీ పడాల్సి వస్తున్నదని అంటూ తన నామినేషన్ ను తిరస్కరించడం వెనక ఇదేకారణమని యాదవ్ అన్నారు.

అయితే, తాము సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని యాదవ్ న్యాయవాది రాజేష్ గుప్తా చెప్పారు.