వారణాసిలో చౌకీదార్ vs జవాన్ : మోదీ మీద పేద సైనికుడి పోటీ…

ప్రతిసభలో ఏదో ఒక విధంగా సైన్యం ప్రస్తావన తీసుకువచ్చి సైన్యానికి నమస్కారం పెట్టి, సైన్యం గొప్పదనం చెప్పి, సైన్యాన్ని ఎమయినా అంటే వూరుకునేది లేదని సైన్యోపాఖ్యానం చెప్పే ప్రధాని మోదీ తన మీద ఒక సైనికుడు పోటీ చేస్తాడని వూహించి వుండరు.

వారణాసిలో ఇపుడు ఆయన మీద ఒక మాజీ సైనికుడు పోటీ చేస్తున్నారు.

అందరి దృష్టి ని ఆకట్టుకుంటున్న వారణాసి ఎన్నిక ఇపుడు జవాన్ వెర్స స్ చౌకీదార్ గా మారిపోయింది. సెక్యూరిటీ డిపాజిట్ కట్టేందుకు కూడా స్తోమత్తు లేని ఒక సైనికుడు ఇపుడు సమాజ్ వాది అభ్యర్థిగా మోదీ మీద తలపడుతున్నారు.

తాను ప్రధాని మీద వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఆయనను ఇపుడు సమాజవాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ తన వైపు తిప్పుకుంది. ఆయనని తమ కూటమి నుంచి పోటీ చేయిస్తున్నారు.

నిజానికి అక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థిగా స్థానిక కాంగ్రెస్ నేత కోడలు శాలినీ యాదవ్‌ను నిలబెట్టాలనుకున్నారు. అయితే,పదే పదే ప్రధాని జవాన్ల ప్రస్తావనను, సైన్యం ప్రస్తావనను తీసుకొస్తూ ఉండటంతో, సమాజ్ వాది పార్టీ శాలినికి బదులు జవాన్‌ తేజ్ బహదూర్ యాదవ్ ను తమ పార్టీ తరఫున నిలబెట్టాలనుకున్నది. మోదీ ని ఇరుకున పెట్టాలనుకున్నది. బిఎస్ పితో పొత్తులో ఈ సీటు సమాజ్ వాది పార్టీకి దక్కింది.

తేజ్ బహదూర్ యాదవ్ వుత్తుత్తి సైనికుడు కాదు. సైన్యంలో అక్రమాలను బయటపెట్టిన వీరసైనికుడు. నిజాయితీ పరుడు. కొంతమంది బిఎస్ ఎఫ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నాడని ఆయన ప్రపంచానికి చెప్పారు.

2017 జనవరిలో ఆయన ఫేస్ బుక్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోపోస్టు చేశారు. నీళ్ల చారు, మాడిన చపాతీలు యుద్ధభూమిలో ఉన్న జవాన్లు పడేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పోస్టు వైరల్ అయింది. ఇది ప్రధాని కార్యాలయం దృష్టికి కూడా వచ్చింది. దీని మీద ఒక నివేదిక పంపాలని పిఎంవో సైన్యాన్ని ఆదేశిచింది. తర్వాత తన ఫిర్యాదుల మీద అధికారులు కనీసం విచారణ కూడా జరపలేదని యాదవ్ మరొక వీడియో పోస్టు చేసి సంచలనం సృష్టించారు.

ఆహారం నాసిరకంగా ఉంటే మాత్రం ఇలా ఒక జవాన్ బజారుకెక్కితే ఎలా, ఆయన ఆరోపణలు నిరాధారమయినవని బిఎస్ ఎఫ్ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆయన ప్రధాని మోదీ మీద వారణాసి లో పోటీ చేస్తానని చెబుతూ ఉన్నారు.వోడించేందుకు కాదు, అవినీతి మీద ప్రధాని ఎంత సీరియస్ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని. డిపాజిట్ కు కూడా డబ్బుల్లేని ఆయనను  ఇపుడు ఆయనను సమాజ్ వాది పార్టీలోకి తీసుకుంది.

‘2014 లో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి భారతదేశమంతా సుడిగాలి సృష్టించి గెలిచి ప్రధాని అయ్యాక మోదీ చాలా చేస్తారని అనుకున్నాను, అయితే, నా ఆశ నిరాశ అయింది. అవినీతి అలాగే ఉంది. మా డిపార్ట్ మెంటులో అవినీతి గురించి నేను ప్రధాన మంత్రికి, రక్షణ శాఖ మంత్రికి, బిఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు లేఖలు రాశాను. ఏమీ కాలే. నన్న వేధించారు. చివరకు నా ఉద్యోగం వూడబెరికారు. అందుకే నేను మోదీ మీద పోటీ చేయాలనుకున్నాను,’ అని ఆయన మీడియా కు చెప్పారు.

‘ ఈ జనవరిలో నాకొడుకు చనిపోయాడు. నాకిపుడెవరూ లేరు. అందుకే నేను పార్లమెంటులో ప్రవేశించి అవినీతి గురించి గొంతెత్తాలనుకుంటున్నాను,’ అని యాదవ్ చెబుతున్నారు.
సైన్యం అంటూ పూనకం తెచ్చుకునే మోదీ ఈ జవాన్ ను గురించి ఏమంటారో చూడాలి.