జాబిల్లిపై భరత వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణం వచ్చేసింది. 140కోట్లకు పైగా భారతీయులు ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. నాలుగు సంవత్సరాల కఠోర శ్రమ.. నలభైఒక్కరోజుల అంతరిక్ష ప్రయాణం వెరసి ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టం ఆవిష్కృతమైంది.
నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జులై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది.
మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న “ట్రాన్స్ లూనార్ కక్ష్య”లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు.
ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన “ల్యాండర్ మాడ్యూల్” ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.
ల్యాండర్ మాడ్యూల్ లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్ మాడ్యూల్ కు అప్ లోడ్ చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల ఎత్తులో ల్యాండర్ పవర్ “బ్రేకింగ్ దశ”లోకి అడుగుపెట్టింది.
అప్పుడు మొదలైంది అసలు టెన్షన్… అదే “17 మినిట్స్ టెర్రర్”! ఈ సమయంలో జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను ఫైర్ చేసుకుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగింది.
అప్పటికి ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంది. దీన్ని”రఫ్ బ్రేకింగ్ దశ” అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగింది. ఆ తర్వాత చంద్రయాన్-3, 90 డిగ్రీలు వంపు తిరిగింది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వచ్చింది. దీన్ని “ఫైన్ బ్రేకింగ్ దశ” అంటారు!
వాస్తవంగా… చంద్రయాన్ – 2 విఫలమైంది ఈ దశలోనే! అయితే ఈ సారి అలా జరగలేదు. దాంతో అప్పటికే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అనే సంగతి శాస్త్రవేత్తల ముఖాలలో కనిపించింది.
అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వేగాలు సున్నాకు చేరుకున్నాయి. ఆ సమయంలో ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషించింది.
ఆ తర్వాత మరింత కిందకు 150 మీటర్ల దగ్గరకు దిగింది. ఈ సమయంలో మరోసారి ల్యాండింగ్ కోసం కాస్త చదునుగా ఉన్న ప్రదేశం కోసం వెతికింది. అనంతరం సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రయాన్ – 3.. చంద్రుడి ఉపరితలాన్ని తాకింది.
దీంతో యావత్ భారత దేశం మొత్తం ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది.. శాస్త్రవేత్తలు సంతోషంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.. ప్రపంచం మొత్తం కరతాళ ధ్వనులు చేసింది.. జయహో భారత్!