బీజేపీ చేతిలో ‘ఆదిపురుష్’ అస్త్రం.!

సినిమాల్నీ, రాజకీయాల్నీ వేరు చేసి చూడలేం. ఔను, రెండూ కలగలిసే వుంటున్నాయి. ‘ఆదిపురుష్’ సినిమాకి భారతీయ జనతా పార్టీ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్న సంగతి తెలిసిందే.

‘ఆదిపురుష్’ హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేత, పైగా కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. గవర్నర్‌గా ఆయనకు అవకాశం దక్కుతుందనే ప్రచారం గతంలో జరిగిందిగానీ, దురదృష్టవశాత్తూ ఆయన అకాలమరణం చెందారు.

అప్పటినుంచీ, ప్రభాస్‌ని మరింత జాగ్రత్తగా చూసుకుంటోంది బీజేపీ. గతంలో ‘బాహుబలి’ సినిమాని బీజేపీ ఎలా రాజకీయంగా వాడేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ని అలా వాడేసుకోవాలనుకుంటోంది.

‘ఆదిపురుష్’ సినిమాకి రాజపోషకులంటే బీజేపీ కార్యకర్తలే అన్నట్లు తయారైంది పరిస్థితి. తిరుపతిలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే, దానికి బీజేపీ అనుబంధ సంఘాల నుంచి పెద్దయెత్తున మద్దతు లభించిందట.

ఈ క్రమంలోనే, బీజేపీతో ‘ఆదిపురుష్’ బంధాన్ని తెగొట్టేందుకు, ‘దళితులకు ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలోకి అనుమతి లేదు..’ అనే పుకార్లు పుట్టించారు కొందరు. దాంతో, ఆదిపురుష్ టీమ్ కంగారు పడింది. మరోపక్క, బీజేపీ మద్దతుదారులైన నెటిజన్లు, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, ‘ఆదిపురుష్’కి ఎలివేషన్స్ ఇస్తున్నారు.

‘ఆదిపురుష్’ థియేటర్లను కాషాయమయం చేసెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, బీజేపీ ఈ సినిమాని ఎలా ట్రీట్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.