మొన్న ఇద్దరు.. ఈసారి పండక్కి నలుగురు హీరోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నిఖాతాలో వేసుకుంటాయి. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద సినిమాలు విడుదలకు పోటీపడుతూ ఉంటాయి. అంతగా ఈ పండగ సీజన్ కు డిమాండ్ ఉందనే చెప్పాలి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పెద్ద హీరోల సినిమాలు విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. బాలయ్య బాబు నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అజిత్ తెగింపు, విజయ్ వారసుడు.. ఇలా ఈ సంక్రాంతికి సినిమాలు విడుదలయ్యాయి.

అయితే సీనియర్ హీరోలు బాలయ్య, చిరంజీవి ఈ పండక్కి సూపర్ హిట్లను అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి పెద్ద హీరోలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం. నాగార్జున గత కొంత కాలంగా సరైనా హిట్ లేక డీలా పడిపోయాడనే చెప్పాలి. ఆయన నటించిన చివరి సినిమా ది ఘోస్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజాయం పొందింది. తాజాగా ఆయన దర్శకుడు ప్రసన్నకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక మరో సీనియర్ హీరో వెంకటేశ్ కూడా ఇదే బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. హిట్ సిరీస్ లతో హిట్టు కొట్టిన దర్శకుడు శైలెష్ కొలనుతో వెంకీ సైంధవ్ అనే సినిమా తీస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. ఇక మూవీను సంక్రాంతి బరిలో నిలపనున్నట్లు సమాచారం. ఇక సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ అటు రామ్ చరణ్‌తో RC15 సినిమా తెరకెక్కిస్తునే.. మరోవైపు లోక నాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమాను… సంక్రాంతి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పెద్ద హీరోల మధ్య పోటీ నెలకొంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదంటున్నారు. మరి వచ్చే సంక్రాంతి సమయానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.