ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం అంటోన్న సమంత!

స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది. తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.

ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, కొత్త అంశాలపై అవగాహన వచ్చినట్లు తెలిపింది. తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా తనకు ఆనందమేనని పేర్కొంది. వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన మనసుకు నచ్చిందే చేస్తానని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదా.. కాదా, అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని తెలిపింది. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేదని పేర్కొంది. అందుకే తానెప్పుడూ మెంటల్‌ హెల్త్‌కు ప్రాధాన్యత నిస్తానని వెల్లడించింది. అందుకోసం అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తుంటానని వివరించింది.